WHO: బీపీ లెక్కలు మారాయి.. ఇకపై 140/90 లోపు ఉంటే సాధారణమే: మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • 21 ఏళ్ల తర్వాత బీపీ మార్గదర్శకాల విడుదల
  • డయస్టాలిక్, సిస్టోలిక్‌లో మార్పులు
  • డయస్టాలిక్ పోటు 90 దాటి రెండు రోజులుంటేనే బీపీగా పరిగణన
  • ప్రపంచవ్యాప్తంగా 1.4 కోట్ల మందిలో బీపీ
  • నియంత్రణలో ఉన్నది 14 శాతమే
WHO revises blood pressure control guidelines

తెలియకుండానే ప్రాణాలను హరించే రక్తపోటు లెక్కలు మారాయి. ఇప్పటి వరకు రక్తపోటు 120/80 ఎంఎంహెచ్‌జీ (మిల్టీమీటర్స్ ఆఫ్ మెర్క్యురీ) గా ఉంటే సాధారణంగా పరిగణించేవారు. అది దాటితే రక్తపోటు ఉన్నట్టుగానే భావించేవారు. అయితే, ఇప్పుడీ లెక్కల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇకపై  140/90 లోపు ఉంటే దానిని  సాధారణంగానే పరిగణిస్తారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. డయస్టాలిక్ (హృదయ వ్యాకోచం), సిస్టోలిక్ (హృదయ సంకోచ సమయంలో గుండె కొట్టుకునే వేగం)‌ కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది.

డయస్టాలిక్ పోటు 90 ఎంఎంహెచ్‌జీ, అంతకుమించి రెండు రోజులపాటు ఉంటేనే దానిని రక్తపోటుగా పరిగణించాలని డబ్ల్యూహెచ్ఓ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, ధూమపానం, మద్యం అలవాటు, ఒకే చోట అదే పనిగా కూర్చుని పనిచేయడం, రోజుకు కనీసం అరంగట అయినా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వారికి, గుండె జబ్బులున్న వారికి సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 ఎంఎంహెచ్‌జీ వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా, వారిలో 14 శాతం మందిలో మాత్రమే అది అదుపులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 21 ఏళ్ల తర్వాత బీపీకి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేయడం గమనార్హం. అధిక రక్తపోటు బాధితుల్లో దాదాపు 46 శాతం మందికి తమలో ఆ సమస్య ఉన్నట్టు గుర్తించలేరు కాబట్టే బీపీని ‘సైలెంట్ కిల్లర్’ అని పిలుస్తారు. కాబట్టే 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు తరచూ బీపీని చెక్ చేయించుకోవడం మంచిది. 40 ఏళ్లు దాటిన వారు తప్పనిసరిగా బీపీని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి.

More Telugu News