రెజ్లింగ్‌ను దత్తత తీసుకున్న యూపీ ప్రభుత్వం.. 2032 వరకూ ఆర్థిక సాయం

26-08-2021 Thu 20:39
  • రాష్ట్రంలో రెజ్లింగ్ అభివృద్ధి కోసం రూ.170 కోట్లు
  • ఒడిశా ప్రభుత్వం నుంచి స్ఫూర్తి తీసుకున్నామన్న డబ్ల్యూఎఫ్ఐ
  • హాకీని దత్తత తీసుకున్న ఒడిశా
UP adopts wrestling Financial assistance until 2032
టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం పతకాలు సాధించిన విభాగాల్లో రెజ్లింగ్ ఒకటి. ఈ క్రమంలోనే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) కొత్త ఆలోచన చేసింది. ఒడిశా ప్రభుత్వం హాకీని దత్తత తీసుకొని, ఆ క్రీడ అభివృద్దికి కృషి చేస్తున్నట్లే.. రెజ్లింగ్‌ను దత్తత తీసుకొని, ఈ క్రీడ అభివృద్ధికి సహకరించాలని ఉత్తరప్రదేశ్‌ను కోరింది. దీనికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకారం తెలపడంతో.. 2032 వరకూ రెజ్లింగ్‌పై రూ.170 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు యూపీ సర్కారు అంగీకరించింది.

‘‘ఒడిశా లాంటి చిన్న రాష్ట్రమే క్రీడాభివృద్ధికి ఇంత చేస్తుంటే.. యూపీ వంటి పెద్ద రాష్ట్రం రెజ్లింగ్‌కు ఎందుకు మద్దతివ్వకూడదు? ఇదే అంశాన్ని ప్రభుత్వానికి తెలుపగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అంగీకరించారు’’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు.

2024 ఒలింపిక్స్ వరకూ ఏటా రూ.10 కోట్లు, ఆపై 2028 ఒలింపిక్స్‌ వరకూ ఏటా రూ.15 కోట్లు, ఆ తర్వాత 2032 ఒలింపిక్ క్రీడల వరకూ ఏటా రూ.20 కోట్ల ఆర్థిక సాయం కోరుతూ ప్రతిపాదన చేసినట్లు సింగ్ తెలిపారు. దీనికి యూపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ నిధులతో క్యాడెట్ స్థాయి రెజ్లర్లకు కూడా స్పాన్సర్స్ లభిస్తారని, నేషనల్ ఛాంపియన్లకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వగలుగుతామని ఆయన అన్నారు.

రెజ్లింగ్ అభివృద్ధి కోసం ఇప్పటికే డబ్ల్యూఎఫ్ఐతో టాటా మోటార్స్ భాగస్వామ్యం కలిగి ఉన్న సంగతి తెలిసిందే. 2018లో జరిగిన ఈ ఒప్పందాన్ని మరోసారి కొత్తగా పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. యూపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో క్యాడెట్ స్థాయి రెజ్లర్లను కూడా విదేశీ పర్యటనలకు తీసుకెళ్లగలుగుతామని సింగ్ పేర్కొన్నారు.