చెప్పాపెట్టకుండా కాబుల్ కు వెళ్లిన అమెరికా ఎంపీలు... ప్రభుత్వం, సైన్యం ఆగ్రహం

26-08-2021 Thu 14:04
  • ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాబూల్ వెళ్లిన ఎంపీలు
  • కొన్ని గంటల పాటు అక్కడే గడిపిన ఎంపీలు
  • వీరి పర్యటన వల్ల తరలింపు ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తాయన్న సైన్యం
Two US law makers went to Kabul without prior information
అమెరికాకు చెందిన ఇద్దరు చట్టసభ్యులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతున్న తరుణంలో వీరిద్దరూ కాబూల్ విమానాశ్రయాన్ని సందర్శించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వీరిద్దరూ కాబూల్ కు వెళ్లడంపై అమెరికా విదేశాంగ శాఖ, సైన్యం ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సెథ్ మౌల్టన్ (డెమోక్రాట్), పీటర్ మీయర్ (రిపబ్లికన్)లు ప్రతినిధుల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిద్దరూ ప్రత్యేక విమానంలో మంగళవారం ఆకస్మికంగా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లారు. విదేశీ పౌరులు, శరణార్థులను తరలిస్తున్న చర్యలను పరిశీలించారు. కొన్ని గంటల పాటు అక్కడ గడిపారు.

వీరిద్దరూ గతంలో సైన్యంలో పనిచేశారు. ప్రస్తుతం సాయుధ సేనల కమిటీలో మౌల్టన్, విదేశీ వ్యవహారాల కమిటీలో మీయర్ సభ్యులుగా ఉన్నారు. వీరి ప్రత్యేక విమానం కాబూల్ లోకి ప్రవేశించడానికి కొన్ని క్షణాల ముందే తమకు వారి పర్యటన గురించి సమాచారం అందిందని సైన్యం పేర్కొంది. ఈ పర్యటన వల్ల ఇతరుల తరలింపుకు ఇబ్బందులు తలెత్తాయని అన్నారు.