Afghanistan: పాకిస్థాన్​ బార్డర్​ కు పోటెత్తిన ఆఫ్ఘన్లు.. కాబూల్​ కన్నా దారుణ పరిస్థితుల్లో వేలాది మంది.. వీడియో ఇదిగో

  • స్పిన్ బోల్దక్ సరిహద్దు వద్ద ఆఫ్ఘన్ల ఎదురుచూపులు
  • వీడియోను పోస్ట్ చేసిన ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్
  • విదేశీ బలగాలు లేవు కాబట్టే మీడియా చూపించట్లేదని ఆవేదన
Hundreds Of Thousands Of Afghans Throng Pak Border

తాలిబన్ల రాజ్యం నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ఆఫ్ఘనిస్థానీలు వెతుక్కుంటున్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఏ విమానం దొరికితే ఆ విమానమెక్కి ఇప్పటికే చాలా మంది దేశం దాటేశారు. బతుకు మీద గంపెడాశతో దేశం దాటేందుకు ఇంకా చాలా మంది మూటాముల్లె సర్దుకుని బయల్దేరుతున్నారు. ఆ వలసలు ఒక్క కాబూల్ కే పరిమితం కాలేదు. వేరే ఇతర నగరాల్లోనూ జరుగుతున్నాయి.

పాకిస్థాన్ సరిహద్దులను వారు దాటే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ స్పిన్ బోల్దక్ బార్డర్ కు వేలాది మంది ఆఫ్ఘన్లు పోటెత్తారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియోను నతీఖ్ మాలిక్జాదా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

‘‘ఇది కాబూల్ ఎయిర్ పోర్టు కాదు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ లోకి ప్రవేశించేందుకు వేలాది మంది ఆఫ్ఘన్లు పోటెత్తిన స్పిన్ బోల్దక్ సరిహద్దు. కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గరి పరిస్థితుల కన్నా ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితులున్నాయి. అయితే, విదేశీ బలగాలేవీ ఇక్కడ లేకపోవడం వల్లే మీడియా ఎక్కువ కవరేజీ ఇవ్వడం లేదు’’ అని నతీఖ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఒక్క పాకిస్థాన్ సరిహద్దుల వద్దే కాదు.. నలుమూలలా ఉన్న సరిహద్దులకు ఆఫ్ఘన్లు తరలిపోతున్నట్టు తెలుస్తోంది.

More Telugu News