Amarinder Singh: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభానికి సిద్ధూనే కారణం: అమరీందర్ భార్య ఆరోపణ

  • రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపారని భర్తకు కితాబు
  • అమరీందర్ రాజీనామా కోరుతున్న నేతలపై మండిపాటు
  • వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ఈ గొడవల ప్రభావం: ప్రెణీత్ కౌర్
 Sidhu is the cause of crisis in Punjab Congress Amarinders wife accused

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి ఆ పార్టీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూనే కారణమని ఆ పార్టీ నేత, సీఎం అమరీందర్ భార్య ప్రెణీత్ కౌర్ మండిపడ్డారు. సీఎం అమరీందర్ సింగ్ రాజీనామా కోరుతూ గొడవ చేస్తున్న రెబల్ ఎమ్మెల్యేలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి రగడ సృష్టించకుండా 2022 అసెంబ్లీ ఎన్నికలకు అందరూ సిద్ధమైతే బావుంటుందని ఆమె అన్నారు.

అలాగే పార్టీకి రాష్ట్రంలో ఎన్నో విజయాలు అందించారని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపారని భర్త అమరీందర్ సింగ్‌ను ప్రశంసించారు. నలుగురు కేబినెట్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కలిసి అమరీందర్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీరంతా అమరీందర్‌ను సీఎంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అమరీందర్ భార్య ప్రెణీత్ కౌర్ మీడియాతో మాట్లాడుతూ.. సదరు రెబల్ నేతలు పార్టీలో పాజిటివ్ పాత్ర పోషించాలని, వచ్చే ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని సూచించారు.

ఇలా అమరీందర్‌పై విమర్శలు చేస్తూ రగడ చేయడం పార్టీని భ్రష్టు పట్టిస్తోందని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రస్తుత సంక్షోభానికి పార్టీ రాష్ట్ర చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూనే కారణమని ఆమె విమర్శించారు. సిద్ధూను పార్టీ చీఫ్‌గా నియమించినప్పుడు అమరీందర్ సింగ్ చాలా పెద్ద మనసు చూపించారని, పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆమె చెప్పారు.

కానీ సిద్ధూ మాత్రం తన సలహాదారులతో కలిసి ఇలాంటి గొడవలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలా రగడ సృష్టించడానికి ఇది సరైన సమయం కాదని, అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిని మార్చాలనే నిర్ణయం రెబల్ ఎమ్మెల్యేల చేతిలో ఉండదని, హైకమాండ్ నిర్ణయమని ఆమె స్పష్టంచేశారు.

More Telugu News