James Anderson: టెస్టుల్లో ఏడోసారి కోహ్లీ వికెట్ తీసిన ఆండర్సన్!

  • ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ రికార్డు సమం
  • మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో ఆండర్సన్‌ బౌలింగ్‌లో కోహ్లీ అవుట్
  • సచిన్ రికార్డునూ సమం చేసిన పేసర్
Anderson takes Kohlis wicket for the seventh time in Tests

ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ మూడో మ్యాచులో ఆండర్సన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. టెస్టుల్లో కోహ్లీ వికెట్ తీయడం ఆండర్సన్‌కు ఇది ఏడోసారి. ఆస్ట్రేలియా జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ కూడా టెస్టు క్రికెట్లో కోహ్లీని 7 సార్లు అవుట్ చేశాడు. ఇప్పుడు ఆండర్సన్ ఈ రికార్డును సమం చేశాడు.

ఆఫ్‌సైడ్ వెళ్తున్న బంతిని కవర్ డ్రైవ్ చేయబోయిన కోహ్లీ.. బట్లర్ చేతికి చిక్కాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఏడోసారి ఆండర్సన్ బౌలింగ్‌లో కోహ్లీ వికెట్ సమర్పించుకున్నట్లయింది. అంతేకాదు, ఒక దేశంలో అత్యథిక టెస్టు మ్యాచులు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కూడా ఆండర్సన్ సమం చేశాడు. సచిన్ ఇలా ఒక దేశంలో 94 టెస్టు మ్యాచులు ఆడగా.. ఆండర్సన్‌కు ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ 94వది.

కాగా, లీడ్స్‌లో ప్రారంభమైన మూడో టెస్టులో భారత జట్టులో ఎటువంటి మార్పులూ చేయలేదు. ఇంగ్లండ్ మాత్రం డామ్ సిబ్లీ, మార్క్ వుడ్ స్థానాల్లో డేవిడ్ మలాన్, క్రెగ్ ఓవర్టన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ టెస్టు మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఘోరమైన ఆరంభం దక్కింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (0)ను ఆండర్సన్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఛటేశ్వర్ పుజారా (1) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో 4/2తో కష్టాల్లో పడిన జట్టును కోహ్లీ ఆదుకుంటాడని అభిమానులు అనుకున్నారు. కానీ వాళ్ల ఆశలను ఆవిరి చేస్తూ కోహ్లీ కూడా 7 పరుగులకే వికెట్ కోల్పోయాడు. అజింక్య రహానే (18), రిషభ్ పంత్ (2) కూడా నిరాశపరిచారు.

More Telugu News