Raghu Rama Krishna Raju: కోర్టు స్పందన రాకముందే సాక్షిలో వార్త ఎలా వచ్చింది? జగన్ కు నిజాయతీ ఉంటే 'సాక్షి'పై విచారణ జరిపించాలి: రఘురామకృష్ణరాజు

  • జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన సీబీఐ కోర్టు
  • కోర్టు స్పందకు ముందే.. నా పిటిషన్లను తిరస్కరించినట్టు సాక్షిలో వార్తలు ఎలా వచ్చాయన్న రఘురాజు
  • ఇలాంటి పరిణామాల వల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య
How news came Sakshi before courts judgement asks Raghu Rama Krishna Raju

ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తుది తీర్పును సీబీఐ కోర్టు వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేశారు. మరోవైపు కోర్టు తీర్పు వెలువడక ముందే సాక్షి మీడియాలో దీనికి సంబంధించిన సమాచారం వచ్చిందంటూ రఘురాజు మండిపడ్డారు. ఢిల్లీ నుంచి ఆయన మాట్లాడుతూ, ఈ సమాచారం సాక్షి మీడియాకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కోర్టు స్పందన రాకముందే తన పిటిషన్లను కోర్టు తిరస్కరించిందనే వార్తలు సాక్షిలో ఎలా వస్తాయని ప్రశ్నించారు.  

ముఖ్యమంత్రి జగన్ కు చిత్తశుద్ది ఉంటే... ఈ సమాచారాన్ని ఇచ్చిన సాక్షి జర్నలిస్టుతో పాటు సాక్షి మీడియాపై విచారణ జరిపించాలని రఘురాజు డిమాండ్ చేశారు. ఇలాంటి పరిణామాల వల్ల కోర్టులపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని చెప్పారు.

పత్రికా రంగానికి సాక్షి చీడపురుగులా పరిణమించిందా? అనే అనుమానాలు ప్రతి ఒక్కరికీ వచ్చే పరిస్థితికి తీసుకొచ్చారని రఘురాజు మండిపడ్డారు. గత రెండున్నరేళ్లలో రూ. 220 కోట్ల నుంచి రూ. 230 కోట్ల విలువైన ప్రభుత్వ ప్రకటనలను సాక్షి పొందిందని అన్నారు. ఎంతో ప్రజాదరణ, ఎంతో ఉన్నతమైన ప్రమాణాలు ఉంటే తప్ప ఇంత పెద్ద మొత్తంలో అడ్వర్టైజ్ మెంట్లు ఎవరికీ రావని చెప్పారు.

ఇలాంటి సాక్షికి జడ్జి సీట్ ఎక్కిన వెంటనే సమాచారం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ముందస్తుగానే వీరికి సమాచారం ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. సాక్షిలో కథనం వచ్చిన విధంగా... ఒకవేళ న్యాయమూర్తి తన పిటిషన్లను కొట్టేస్తే ప్రజలకు న్యాయవ్యవస్థపై సందేహాలు వస్తాయి కదా? అని వ్యాఖ్యానించారు. జడ్జి చెప్పేంత వరకు కూడా ఆగలేరా? అని ప్రశ్నించారు.  ఇది మీడియా మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయమని అన్నారు. ఈ అంశంపై తన లాయర్ తో మాట్లాడతానని చెప్పారు. ఇది మా ముఖ్యమంత్రికి కూడా అప్రదిష్టేనని అన్నారు. దీనిపై సీఐడీతో కాకుండా మరో మంచి అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సాక్షి విలేకరికి కోర్టు నుంచి కాగితాలు వచ్చాయా? లేక మన పార్టీ కార్యాలయం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? లేదా తాడేపల్లి నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? అనే విషయాలపై విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ సాక్షిలో వచ్చిన వార్తే నిజమైతే... న్యాయవ్యవస్థ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ నిమిషం వరకు ఇంకా జడ్జిమెంట్ రాలేదని... కానీ, ఉదయం 10.53 గంటలకే సాక్షిలో వార్త ఎలా వచ్చిందనే విషయం ప్రజలకు అర్థం కావడం లేదని చెప్పారు.

More Telugu News