నిన్న అరెస్టయిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు బెయిల్ మంజూరు

25-08-2021 Wed 06:58
  • సీఎం చెంప పగలగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు
  • మంత్రిపై కేసు నమోదు.. నిన్న రత్నగిరిలో అరెస్ట్ 
  • రాజకీయ ప్రేరేపితమన్న న్యాయవాదులు
Union minister Narayan Rane granted bail
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చెంప పగలగొట్టాలని వ్యాఖ్యానించి తీవ్ర దుమారం రేపిన కేంద్రమంత్రి నారాయణ్ రాణేకు రాయ్‌గఢ్‌లోని మహద్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. రాణే అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని, ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. పరిశీలించిన న్యాయస్థానం రాణేకు బెయిలు మంజూరు చేసింది.

జన ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం రాయ్‌గఢ్ జిల్లాలో పర్యటించిన నారాయణ్ రాణే మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నాళ్లయిందో కూడా మన ముఖ్యమంత్రికి తెలియదని, అలాంటి వ్యక్తిని పట్టుకుని చెంప పగలగొట్టాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో కేసు నమోదైంది. నిన్న ఆయన రత్నగిరి పర్యటనలో ఉండగా పోలీసులు అరెస్ట్ చేశారు.