నష్టాలు తెచ్చే పరిశ్రమలనే నాడు మేం ప్రైవేటీకరించాం: రాహుల్ గాంధీ

24-08-2021 Tue 21:00
  • పలు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
  • మోదీ సర్కారు అన్నింటినీ అమ్మేస్తోందని వెల్లడి
  • ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని వివరణ
Rahul Gandhi opines on privatization
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించడం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కదాన్ని ప్రైవేటీకరించాలని మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, హేతుబద్ధతలేని ప్రైవేటీకరణకే తాము వ్యతిరేకం అని రాహుల్ స్పష్టం చేశారు.

రైల్వేలను తాము వ్యూహాత్మక రంగంగా పరిగణించామని, అలాంటి వ్యూహాత్మక రంగాలను తాము ప్రైవేటీకరించలేదని వివరించారు. నష్టాలు తెచ్చే పరిశ్రమలనే నాడు తాము ప్రైవేటీకరించామని రాహుల్ గాంధీ వెల్లడించారు. గుత్తాధిపత్యానికి దారితీసేలా తాము ప్రైవేటీకరించలేదని వివరణ ఇచ్చారు. మోదీ సర్కారు మాత్రం అన్నింటిని అమ్మేయాలని చూస్తోందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహించే తీరు బీజేపీకి తెలియదని విమర్శించారు.