ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై ఏపీ హైకోర్టులో విచారణ

24-08-2021 Tue 16:49
  • విచారణకు హాజరైన ఐఏఎస్ లు
  • ప్రతి విచారణకు రావాల్సిందేనన్న హైకోర్టు
  • పెండింగ్ బిల్లులపై వివరణ 
  • కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని వెల్లడి
  • తాము ఇప్పటికే చెల్లింపులు చేశామన్న కేంద్రం
High Court hearing on pending bills
రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించకపోవడంతో దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు నేడు విచారణ కొనసాగించింది. ఈ విచారణకు రాష్ట్ర ఐఏఎస్ అధికారులు  ఎన్ఎస్ రావత్, గోపాలకృష్ణ ద్వివేది హాజరయ్యారు. పిటిషనర్ల తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్, వీరారెడ్డి వాదనలు వినిపించారు. కేంద్రం తరఫు న్యాయవాది కూడా ఈ విచారణకు హాజరయ్యారు.

నగదును నేరుగా కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ, కాంట్రాక్టర్లకు నగదు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చెల్లింపుల వివరాలను న్యాయస్థానానికి సమర్పించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ప్రతి విచారణకు ప్రభుత్వ ఉన్నతాధికారులు కోర్టుకు రావాల్సిందేనని ఐఏఎస్ లను ఆదేశించింది.

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఇప్పటివరకు రూ.400 కోట్లు చెల్లించామని, ఇంకా రూ.1,1,00 కోట్లు వారం రోజుల్లో చెల్లిస్తామని పేర్కొంది. పంచాయతీల ఖాతాల్లో డబ్బు జమచేసినట్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రావాల్సి ఉందని తెలిపింది. అందుకు కేంద్రం తరఫు న్యాయవాది బదులిస్తూ, తాము ఇప్పటికే పూర్తి డబ్బు ఇచ్చేశామని స్పష్టం చేశారు.

ఈ వాదనల్లో కోర్టు జోక్యం చేసుకుంది. చేసిన పనులు, ఎవరు ఎంత చెల్లించారు? అనే అంశాలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 22కి వాయిదా వేసింది.