Earthquake: బంగాళాఖాతంలో భూకంపం... చెన్నైలో ప్రకంపనలు

Earthquake in Bay Of Bengal
  • ఈ మధ్యాహ్నం సముద్రంలో భూకంపం
  • రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రత నమోదు
  • చెన్నైలో పరుగులు తీసిన ప్రజలు
  • సునామీ వచ్చే అవకాశం లేదన్న నిపుణులు
బంగాళాఖాతంలో నేడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.1గా నమోదైంది. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని చెన్నైలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప కేంద్రం చెన్నై నగరానికి తూర్పు-ఈశాన్య దిశలో 320 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపానికి సంబంధించిన వివరాలను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సీస్మాలజీ వెల్లడించింది.

ఈ మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని వివరించింది. ఏపీలోని కాకినాడకు దక్షిణ-ఆగ్నేయ దిశలో 296 కిలోమీటర్లు, రాజమండ్రికి దక్షిణ-ఆగ్నేయంగా 312 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపకేంద్రం ఉన్నట్టు తెలిపింది.

దీని ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. కాగా, ఈ భూకంప ప్రభావం నేపథ్యంలో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. అటు, ఏపీలోనూ పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ వెల్లడించింది. 
Earthquake
Bay Of Bengal
Chennai
Tremors
India

More Telugu News