study: విశ్రాంతి స‌మ‌యాన్ని ఎంజాయ్ చేయ‌కుండా ఒత్తిడి పెంచుకుంటోన్న ప్ర‌జ‌లు.. తాజా అధ్యయనంలో వెల్ల‌డి

  • ఓహాయో స్టేట్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కుల అధ్యయ‌నం
  • ఆ స‌మ‌యం అంతా వృథా అయిపోతోంద‌ని భావిస్తోన్న ప‌ని రాక్ష‌సులు
  • ఈ స‌మయాన్ని కూడా ఆఫీసులో గ‌డుపుతూ స‌ద్వినియోగం చేసుకుంటే మంచిద‌ని ఆలోచ‌న‌
  • సెల‌వుల‌ను సంతోషంగా గ‌డ‌ప‌లేక‌పోతోన్న వైనం
Feelings like leisure increase levels of stress depression

కొందరికి ప‌ని, చ‌దువు త‌ప్ప వేరే ఆలోచ‌నే ఉండ‌దు. ఎప్పుడూ ఉద్యోగం, చ‌దువు మీదే దృష్టి పెట్టి ఇత‌ర విష‌యాల‌ను ప‌ట్టించుకోకుండా ఉంటారు. ఇటువంటి ప‌ని రాక్ష‌సులు త‌మ‌కు సెల‌వులు వ‌చ్చినా వాటిని వృథాగా భావిస్తారు. సెల‌వు రోజుల్లో హాయిగా విశ్రాంతి తీసుకోకుండా ఆ స‌మ‌యం అంతా వృథా అయిపోతోంద‌ని, ఈ స‌మయాన్ని కూడా ఆఫీసులో గ‌డుపుతూ స‌ద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప‌నులు  చేసేవారమ‌ని అనుకుంటారు. ప‌ని చేసుకుంటూ ఉత్పాద‌క‌త‌ను పెంచడ‌మే త‌మ ఏకైక‌ ల‌క్ష్యంగా భావిస్తుంటారు.

అయితే, ఇటువంటి వారిలో ఒత్తిడి స్థాయి అధికంగా ఉంటుంద‌ని,  జీవితాన్ని అంత‌గా సంతోషంగా గ‌డ‌ప‌లేర‌ని ఓహాయో స్టేట్ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు గుర్తించారు. వారి ప‌రిశోధ‌నల‌ ఫ‌లితాల‌ను ఎక్స్‌పెరిమెంట‌ల్ సోషియ‌ల్ సైకాల‌జీ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. సాధార‌ణంగా ఉద్యోగుల‌కు విశ్రాంతి ల‌భిస్తే వారిలో నూతనోత్సాహం వ‌స్తుందని, వారిలో ఒత్తిడి త‌గ్గుతుంద‌ని గ‌తంలో ఎన్నో ప‌రిశోధ‌న‌లు తేల్చాయ‌ని ఓహాయో స్టేట్ వ‌ర్సిటీ ప‌రిశోధ‌కుడు మాల్కొక్ తెలిపారు.

ఉద్యోగుల‌కు సెల‌వులు ఇస్తేనే ఉత్పాద‌క‌త మ‌రింత పెరుగుతుంద‌ని కూడా గ‌తంలో తేలింద‌ని చెప్పారు. అయితే, ప‌నికే అంకిత‌మ‌య్యే కొంద‌రు ఉద్యోగుల్లో మాత్రం ఒత్తిడిస్థాయి పెరుగుతోంద‌ని, వారికి దొరికిన‌ విశ్రాంతి స‌మ‌యాన్ని ఎంజాయ్ చేయ‌లేక‌పోతున్నార‌ని తెలిపారు. త‌మ అధ్య‌య‌నంలో భాగంగా ప‌రిశోధ‌కులు 199 మంది క‌ళాశాల విద్యార్థుల నుంచి వివ‌రాలు సేక‌రించారు.

సెల‌వుల స‌మ‌యంలో వారు ఎంత‌గా ఎంజాయ్ చేశార‌న్న విష‌యాల‌ను తెలుసుకున్నారు. అలాగే, వారిలో సంతోషం, ఒత్తిడి, ఆందోళ‌న స్థాయులు వంటి అంశాలను లెక్క‌గ‌ట్టారు. ప‌రిశోధ‌న‌లో పాల్గొన్న విద్యార్థుల్లో చాలా మంది విశ్రాంతి దొర‌క‌డం స‌మ‌యం వృథా అనే  అభిప్రాయాన్నే వ్య‌క్తం చేశారు. విశ్రాంతి స‌మ‌యంలో హాయిగా గ‌డ‌ప‌డం కోసం తాము చేసిన ప‌నులను అంత‌గా ఎంజాయ్ చేయ‌లేక‌పోయామ‌ని చెప్పారు.

అలాగే, 2019 హాలోవీన్‌ వేడుక అనంత‌రం 302 మంది నుంచి ఆన్‌లైన్ వేదిక‌గా ప‌రిశోధ‌కులు వివ‌రాలు సేక‌రించారు. సెల‌వుల సంద‌ర్భంగా హాలోవీన్ వేడుక‌ను జ‌రుపుకున్నారా? అని ప‌రిశోధ‌కులు ప్ర‌శ్నించారు. అయితే, చాలా మంది సొంత ప‌నుల‌పైనే దృష్టి పెట్టామ‌ని చెప్పారు. కొంద‌రు పార్టీల‌కు వెళ్లామ‌ని చెప్ప‌గా, మ‌రికొంద‌రు త‌మ పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లి వారితో గ‌డ‌ప‌డంపైనే దృష్టి పెట్టామ‌ని తెలిపారు.

హాలోవీన్‌ సెల‌వు‌ను ఎంత‌గా ఎంజాయ్ చేశార‌న్న విష‌యాన్ని కూడా ప‌రిశోధ‌కులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. అయితే, విశ్రాంతి కోసం దొరికిన స‌మ‌యం వృథా అవుతోంద‌ని భావించే వారంతా ఆ స‌మ‌యంలో పార్టీల‌కు వెళ్లిన‌ప్ప‌టికీ అంత‌గా హాయిగా గ‌డ‌ప‌లేక‌పోయిన‌ట్లు చెప్పారు.

అయితే, పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లిన‌ వారు మాత్రం ఆ స‌మ‌యాన్ని వృథాగా భావించ‌కుండా హాలోవీన్ వేడుక‌లో ఇత‌రులు ఎంత‌గా ఎంజాయ్ చేస్తారో అంతే హాయిగా గ‌డిపార‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు. పిల్ల‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్ల‌డం, వారి గురించి ప‌ట్టించుకోవ‌డం వంటి కార్య‌క‌లాపాల‌ను బాధ్య‌త‌గా భావించే త‌ల్లిదండ్రులు ఆ ప‌ని చేస్తే త‌మ‌ విశ్రాంతి స‌మ‌యం స‌ద్వినియోగం అయింద‌ని భావిస్తున్నార‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు.

విశ్రాంతి స‌మ‌యాన్ని వృథాగా భావించ‌డం అనేది కేవ‌లం అమెరికాలోని ప్ర‌జ‌ల‌కు సంబంధించిన విష‌యం మాత్ర‌మే కాద‌ని, భార‌త్‌, ఫ్రాన్స్ లోనూ ఇదే తీరు ఉంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. ముఖ్యంగా భార‌తీయులు త‌మ సంస్కృతి, సంప్ర‌దాయాల కార‌ణంగా విశ్రాంతి స‌మ‌యం వృథాగా భావిస్తున్నార‌ని ప‌రిశోధ‌కులు వివ‌రించారు. విశ్రాంతి స‌మ‌యం వృథా అని, ఎల్ల‌ప్పుడు బిజీగా, ప‌నులు చేస్తూ ఉత్పాద‌క‌త‌ను పెంచ‌డంలోనే గ‌డ‌పాల‌నే ఆలోచ‌న‌లు ఉన్న వారు ప్ర‌పంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నార‌ని ప‌రిశోధ‌కులు వివ‌రించారు.

More Telugu News