ఈ రక్షాబంధన్ నాకు ఎంతో ప్రత్యేకమైనది: ప్రియాంక చోప్రా

23-08-2021 Mon 12:50
  • ఐదేళ్ల తర్వాత సోదరుడితో కలిసి రక్షాబంధన్ జరుపుకున్న ప్రియాంక
  • గత ఏడాది నుంచి లండన్ లో ఉంటున్న వైనం  
  • 'సైటడెల్' సిరీస్ లో నటిస్తున్న ముద్దుగుమ్మ 
Priyanka Chopra And Brother Siddharth Celebrate Raksha Bandhan
బాలీవుడ్ లో అగ్రనటిగా కొనసాగిన ప్రియాంక చోప్రా గత కొన్నాళ్లుగా హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికన్ సింగర్ నిక్ జొనాస్ ను పెళ్లాడిన ప్రియాంక అక్కడే సెటిలైపోయింది. ఇక నిన్న జరిగిన రక్షాబంధన్ ఆమెకు ప్రత్యేకంగా నిలిచింది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రాతో కలసి ఐదేళ్ల తర్వాత ఆమె రక్షాబంధన్ వేడుక చేసుకుంది.

ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రియాంక వెల్లడించింది. ఇద్దరం కలిసి ఐదేళ్ల తర్వాత రక్షాబంధన్ చేసుకున్నామని తెలిపింది. 'నా ఆర్మీలోని సోదరులందరికీ హ్యాపీ రాఖీ' అంటూ విషెస్ తెలిపింది. మీరందరూ ఎక్కడ ఉన్నా ప్రేమాభిమానాలను, రాఖీలను పంపుతున్నానని, త్వరగా రాఖీ కానుకలు వస్తాయని ఆశిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం ప్రియాంక లండన్ లో ఉంది. ఆమె తాజా సిరీస్ 'సైటడెల్' గత ఏడాది నుంచి లండన్ లో షూటింగ్ జరుపుకుంటోంది.