Narendra Modi: మోదీని కలవడానికి 815 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న కశ్మీర్ యువకుడు

  • ఫాహిమ్ నజీర్ షా అనే యువకుడు శ్రీనగర్ నుంచి పాద‌యాత్ర‌
  • ఇప్ప‌టికి 200 కిలోమీట‌ర్లు న‌డిచిన యువ‌కుడు
  • ఢిల్లీకి చేరుకుని మోదీని క‌లుస్తాన‌న్న యువ‌కుడు
  • మోదీ ప్ర‌సంగం విని అభిమాని అయిన న‌జీర్ షా
kashmir man starts padayatrha for modi

ఉగ్ర‌వాదుల దాడులు, కార్య‌కలాపాల‌తో ప‌దేప‌దే ఉద్రిక్త ప‌రిస్థితులు చోటుచేసుకునే జ‌మ్మూక‌శ్మీర్‌లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేతృత్వంలో జ‌రుగుతోన్న అభివృద్ధి ప‌నులు ఆ ప్రాంతంలోని ఓ యువ‌కుడిని ఆక‌ర్షించాయి. ఎంత‌గా అంటే.. మోదీని చూడ‌డానికి 815 కిలోమీట‌ర్ల కాలిన‌డ‌క‌న వెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకునేంత‌లా. ఫాహిమ్ నజీర్ షా అనే యువకుడు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఈ పాదయాత్ర ప్రారంభించాడు.

శ్రీ‌న‌గ‌ర్‌లోని షాలిమార్ వాసి న‌జీర్ ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తున్నాడు. తన యాత్రలో భాగంగా ఇప్పటికి 200 కిలోమీట‌ర్లు న‌డిచి, ఆదివారం నాడు ఉధంపూర్ నగరానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తాను మోదీకి వీరాభిమానినని తెలిపాడు. తాను ఆయ‌న‌ను కలవడానికి కాలినడకన ఢిల్లీకి వెళుతున్నానని తెలిపాడు. ఇలా కాలిన‌డ‌క‌న వెళ్తే మోదీని క‌లిసే అవ‌కాశం ఉంటుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పాడు.

మోదీని కలవాల‌ని తాను చాలా కాలంగా ప్ర‌యత్నిస్తున్నాన‌ని తెలిపాడు. నాలుగు సంవత్సరాలుగా తాను సోషల్ మీడియాలో మోదీని ఫాలో అవుతున్నాన‌ని చెప్పాడు. గ‌తంలో ఓసారి ర్యాలీలో మోదీ మాట్లాడుతుండగా.. ‘అజాన్’ (ప్రార్థన చేయ‌డానికి ముస్లిం పిలుపు) వినగానే ఒక్క‌సారిగా ఆయన తన ప్రసంగాన్ని ఆపేశార‌ని, ప్రార్థ‌న‌ను అంత‌గా గౌర‌వించార‌ని చెప్పాడు. మోదీ చూపిన ఆ సంస్కారం త‌న‌ను ఎంతగానో ఆక‌ర్షించింద‌ని తెలిపాడు.  

రెండున్నర సంవత్సరాలుగా ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసేందుకు తాను అనేక ప్రయత్నాలు చేశానని అన్నాడు. కశ్మీర్‌కు మోదీ వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌ను క‌లిసేందుకు భద్రతా సిబ్బంది త‌నకు అనుమతి ఇవ్వ‌లేద‌ని చెప్పాడు. పాద‌యాత్ర చేస్తుండ‌డంతో ఈ సారి మోదీని కలిసే అవకాశం వస్తుందని భావిస్తున్న‌ట్లు తెలిపాడు.

జమ్మూ కశ్మీర్ లో ఆర్టిక‌ల్ 370 రద్దు చేసి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చ‌డంతో మార్పు కనిపిస్తోందని చెప్పాడు. కశ్మీర్ లో అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపాడు. తాను నిరుద్యోగ యువకుల సమస్యలపై మోదీతో మాట్లాడ‌తాన‌ని చెప్పాడు.

More Telugu News