Taliban: ప్రభుత్వ ఏర్పాటులో తలమునకలైన తాలిబన్లు.. జిహాదీలకు ప్రభుత్వంలో స్థానం

Taliban co founder Abdul Ghani Baradar in Kabul to hammer out govt
  • మార్గదర్శకాల తయారీలో బరాదర్ బిజీ
  • హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లాతోనూ చర్చలు
  • హక్కానీ నెట్‌వర్క్ నేతలతోనూ సమావేశం
  • వచ్చే  నెల నుంచి తాలిబన్ల పాలన ప్రారంభం!
ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ విధివిధానాలు, మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే రీతిలో ఈ మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, రాజకీయ విభాగ అధిపతి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కాబూల్‌లో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఆఫ్ఘన్ పునర్నిర్మాణ సమాఖ్య చైర్మన్ అబ్దుల్లా అబ్దుల్లాతో ఈ విషయాలు చర్చించినట్టు సమాచారం. అలాగే, తాలిబన్ల ప్రభుత్వంలో జిహాదీలకు స్థానం కల్పించాలని ఇది వరకే నిర్ణయించిన నేపథ్యంలో వారితోనూ చర్చలు జరపనున్నారు. హక్కానీ నెట్‌వర్క్ నేతలు ఖలీల్ హక్కానీ, అనాస్ హక్కానీ, అతడి సోదరుడి కుమారుడైన సిరాజుద్దీన్ హక్కానీ తదితరులతో చర్చలు జరపనున్నారు. కాగా, ఈ నెలాఖరు నాటికి అమెరికా సేనలు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి పూర్తిగా వైదొలగనున్న నేపథ్యంలో ఆ తర్వాతే తాలిబన్ల పాలన ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.
Taliban
Afghanistan
Abdul Ghani Baradar
Kabul

More Telugu News