దళితబంధు ఎఫెక్ట్.. రెండు రోజుల పాటు విశ్వబ్రాహ్మణుల రిలే నిరాహారదీక్షలు

22-08-2021 Sun 07:23
  • తమకు కూడా విశ్వకర్మబంధు ప్రకటించాలి
  • ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
  • కేసీఆర్ గతంలో ప్రకటించిన రూ. 250 కోట్లను మంజూరు చేయాలి
Vishwakarmas to take up relay hunger strike
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు పథకం ఇతర కులాల వారిలో అసంతృప్తికి కారణమవుతోంది. తమకు కూడా బంధు ప్రకటించాలని ఇతర కులాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహారదీక్షలు చేపడుతున్నట్టు విశ్వకర్మ సామాజికవర్గం ప్రకటించింది. ఈ నెల 23, 24 తేదీల్లో దీక్షలు చేపడుతున్నట్టు విశ్వకర్మ సంఘం నేతలు వడ్ల సుదర్శనాచారి, పొన్నాల శ్యామ్ చారి, వడ్ల మహేంద్రాచారి, మోత్కూర్ వీరభద్రాచారి, కంజర్ల కృష్ణమూర్తి, భరత్ చారి తెలిపారు.

విశ్వకర్మీయులకు విశ్వకర్మబంధు ప్రకటించాలని, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విశ్వకర్మ సామాజికవర్గ సంక్షేమానికి రూ. 250 కోట్లు మంజూరు చేస్తానని 2016లో నిర్వహించిన వరంగల్ సభలో కేసీఆర్ ప్రకటించారని... ఇంతవరకు ఆ నిధులను విడుదల చేయలేదని విమర్శించారు. సీఎం ప్రకటించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.