Varla Ramaiah: అంబేద్కర్‌ను అవమానించిన ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి వర్ల రామయ్య ఫిర్యాదు

  • వర్గ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడారు
  • అట్రాసిటీ సహా ఇతర కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని రామయ్య డిమాండ్
  • తన వ్యాఖ్యలను వక్రీకరించారన్న ఎమ్మెల్యే
Varla Ramaiah demand to take action against jogi ramesh

ఎస్సీ, ఎస్టీల కోసమే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారంటూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలతో రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీలను కించపరిచారని, ఆయన వ్యాఖ్యలు వర్గ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని అన్నారు. రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. జోగి రమేశ్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సహా పలు ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయాలని రామయ్య డిమాండ్ చేశారు.

తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే జోగి రమేశ్ స్పందించారు. తన మాటలను వక్రీకరించారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ మైనారిటీల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే, బలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని రాస్తున్న వ్యక్తి జగన్ అని మాత్రమే తాను అన్నానని పేర్కొన్నారు. జనరల్ స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను జగన్ కూర్చోబెడుతున్నారని, ఇదే విషయాన్ని తాను చెబితే దానిని వక్రీకరించిన చంద్రబాబు తమ వర్గాలను చీల్చాలని చూస్తున్నారని రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News