పాక్‌లో చైనా ఇంజనీర్లు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి.. చైనా ఎంబసీ ఆందోళన!

21-08-2021 Sat 18:58
  • చైనా ఇంజినీర్లు టార్గెట్‌గా గ్వాదర్‌లో ఆత్మాహుతి దాడి
  • గాయపడిన ఒక చైనీయుడు.. ఇద్దరు స్థానిక పిల్లలు మృతి
  • బాధ్యులమంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటన
  • దాడిపై సమగ్ర దర్యాప్తు జరపాలని పాకిస్థాన్‌కు సూచన
China Embassy Concern Situation Tension in Pakistan

చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ)లో భాగంగా నిర్మిస్తున్న ఒక రహదారి వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. గ్వాదర్ ప్రాంతంలో గ్వాదర్ ఈస్ట్ బే ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టు నిర్మిస్తున్న చైనా ఇంజినీర్లే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడికి తాము బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.

ఈ దాడిలో ఇద్దరు స్థానిక చిన్నారులు దుర్మరణం పాలవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక చైనా పౌరుడు కూడా గాయపడినట్లు సమాచారం. ‘‘ఈ ఉగ్రవాద చర్యను పాకిస్థాన్‌లోని చైనా ఎంబసీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇరుదేశాలకు చెందిన గాయపడిన వ్యక్తులకు సానుభూతి తెలుపుతోంది. మృతిచెందిన అమాయకుల పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది’’ అని చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
 
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో ఇటీవలి కాలంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్న చైనా ఎంబసీ.. ఉగ్రవాద దాడుల్లో పలువురు చైనీయులు మరణించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ క్రమంలో పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని, అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు వెళ్లొద్దని పాక్‌లోని తమ దేశ పౌరులకు సూచనలు చేసింది. ఈ దాడులపై క్షుణ్ణమైన దర్యాప్తు చేపట్టి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని పాకిస్థాన్‌ను డిమాండ్ చేసింది.

కాగా, జూలై నెలలో కూడా ఇలాగే ఖైబర్-పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన దాడిలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 9 మంది చైనీయులున్నారు. ఇది దాడి కాదని, మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల గ్యాస్ లీక్ జరిగి పేలుడు సంభవించిందని పాకిస్థాన్ తొలుత ప్రకటించింది. ఆ తర్వాత పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఈ ఘటన టెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద ముఠా చేసిన దాడేనని తేల్చింది. అయితే ఈ పేలుడుతో తమకేమీ సంబంధం లేదని సదరు ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.