Taliban: మూగబోయిన తాలిబన్ల వెబ్ సైట్లు

  • ఆఫ్ఘన్ లో తాలిబన్ దురాక్రమణ
  • ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాల నిలిపివేత
  • నిన్నటి నుంచి నిలిచిన వెబ్ సైట్లు
  • ఐదు భాషల్లో వెబ్ సైట్లు నిర్వహిస్తున్న తాలిబన్లు
Taliban websites goes offline

ఆఫ్ఘనిస్థాన్ లో వేళ్లూనుకుపోయిన తాలిబన్లను నిర్మూలించలేక అమెరికా నిష్క్రమిస్తోంది. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా సేనల ప్రాబల్యం కొనసాగినంతకాలం తాలిబన్లు పలు వెబ్ సైట్లు, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తమ బాణి వినిపించేవారు. తీవ్ర భావజాల వ్యాప్తికి వెబ్, సోషల్ మీడియా మాధ్యమాలను వారు వినియోగించుకునేవారు.

అయితే, ఆఫ్ఘన్ లో తాలిబన్ల దురాక్రమణ నేపథ్యంలో ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తాలిబన్ల ఖాతాలను నిషేధించాయి. ఈ క్రమంలో, నిన్నటి నుంచి తాలిబన్ వెబ్ సైట్లు కూడా మూగబోయాయి. తాలిబన్లు ప్రధానంగా ఐదు భాషల్లో వెబ్ సైట్ల ద్వారా తమ భావజాల వ్యాప్తి, ప్రకటనలు చేస్తుంటారు. పష్తో, ఉర్దు, అరబిక్,  ఇంగ్లిష్, దరీ భాషల్లో తాలిబన్లు వెబ్ సైట్లను నిర్వహిస్తున్నారు. ఈ వెబ్ సైట్లు శుక్రవారం నుంచి ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోయాయి.

క్లౌడ్ ఫ్లేర్ సంస్థ ఈ వెబ్ సైట్ల హోస్టింగ్ కార్యకలాపాలు చేపడుతుండగా, మీడియా ప్రతినిధులు ఆ సంస్థను సంప్రదించగా, సరైన స్పందన రాలేదు. తాలిబన్ల వెబ్ సైట్ల కార్యకలాపాలు నిలిచిపోవడం మంచి పరిణామమేనని మీడియా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబన్లు తమ భావజాలంతో ప్రజలనే కాకుండా అల్ ఖైదా, తదితర అతివాద ఇస్లామిక్ సంస్థలను కూడా ప్రేరేపించగలరని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News