వివేకా హత్యకేసులో సాక్ష్యం చెప్పేవారికి జగన్ రూ.కోటి ఇవ్వాలి: రఘురామ

21-08-2021 Sat 15:08
  • వివేకా హత్యకేసులో కొనసాగుతున్న దర్యాప్తు
  • నజరానా ప్రకటించిన సీబీఐ
  • సమాచారం అందిస్తే రూ.5 లక్షలు
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రఘురామ
Raghurama comments on CBI announcement

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సమాచారం అందించినవారికి సీబీఐ రూ.5 లక్షల నజరానా ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకేసులో సీబీఐ ప్రకటన ఇచ్చిందని, నిజాలు తెలిపిన వారికి రూ.5 లక్షలు ఇస్తామంటున్నారని, ఆ లెక్కన సాక్ష్యం చెప్పేందుకు వచ్చేవారికి జగన్ రూ.కోటి బహుమానం ఇవ్వాలని అన్నారు.

"ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తే వెంటనే పట్టుకుంటున్నారు. మరి వివేకా హత్యకేసులో నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయారు?" అని రఘురామ ప్రశ్నించారు. ఈ కేసులో ఉన్న శ్రీనివాసరెడ్డి గతంలోనే హత్యకు గురయ్యాడని వెల్లడించారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా రక్షణ కోరారని తెలిపారు. సీబీఐ ప్రకటనతో వివేకా హత్యకేసు త్వరగా పూర్తవుతుందని భావిస్తున్నట్టు రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లపై అప్పులు తీసుకోవాలని చూస్తున్నారంటూ ఏపీ సర్కారుపై విమర్శలు చేశారు. తప్పుడు ఉద్దేశాలతో కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ అప్పులు చేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఏపీ మద్యం ఆదాయం ఎక్కడికి పోతోందని ప్రశ్నించారు.