New Delhi: ఢిల్లీలో భారీ వర్షాలు.. తటాకాలైన రోడ్లు.. ‘రెడ్​ అలర్ట్’ జారీ చేసిన వాతావరణ శాఖ

Delhi Witnessed Heavy Rain Fall Red Alert Issued For Tomorrow By IMD
  • ఎక్కడికక్కడ నిలిచిన వరద నీరు
  • పలు అండర్ పాస్ ల మూసివేత
  • చాలాచోట్ల ట్రాఫిక్ మళ్లింపు
  • ఇవాళ ఉదయం వరకు 13.88 సెంటీమీటర్ల వర్షపాతం

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటలుగా తెరిపి లేకుండా పడుతున్న వానతో నగరంలోని రోడ్లన్నీ తటాకాల్లా మారిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయింది. నిన్న సాయంత్రం 5.30 గంటల వరకు కేవలం 11 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని, అయితే, ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు 13.88 సెంటీమీటర్ల వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇవాళ మొత్తం మబ్బులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది.


ఢిల్లీ రైల్వే స్టేషన్ లోని పట్టాలు మునిగిపోవడంతో రైళ్లను రద్దు చేశారు. చాలా చోట్ల భారీ వరదలుండడం, అండర్ పాస్ లలో వరద నీరు నిలవడంతో ఆయాచోట్ల ట్రాఫిక్ ను నిలిపేశారు. వేరే మార్గాలకు మళ్లించారు. ముందుజాగ్రత్తగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. మింటో బ్రిడ్జి , ఆజాద్ మార్కెట్ అండర్ పాస్, మూల్ చంద్ అండర్ పాస్, పూల్ ప్రహ్లాద్ పూర్ అండర్ పాస్ లను మూసేశారు. ఐటీవో, ప్రగతి మైదాన్, లజపతి నగర్, జంగ్ పురాల్లో వరదనీరు నిలవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

ఇవాళ్టికి ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసిన వాతావరణ శాఖ.. రేపటికి రెడ్ అలర్ట్ ను ఇచ్చింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వీలైతే ఇళ్ల నుంచి బయటకు రావొద్దన్న సూచనలను చేస్తోంది.

  • Loading...

More Telugu News