Afghanistan: ఆఫ్ఘన్ల సాయుధ పోరాటం: 4 జిల్లాలు తాలిబన్ల నుంచి తిరిగి స్వాధీనం

Armed Revolt Of Afghans Re captures 4 districts from Talibans
  • తుపాకులు చేతబట్టి పోరాడుతున్న ప్రజలు
  • 40 మంది ఉగ్రవాదుల హతం
  • తిరుగుబాటు ఇక్కడితో ఆగదన్న మాజీ రక్షణ మంత్రి
ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు చెరపట్టినప్పటి నుంచి ప్రజలు భయంతో దేశం దాటుతున్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానం కోసం ఆరాటపడుతున్నారు. కానీ, కొందరు మాత్రం ఎదురు తిరుగుతున్నారు. పోరాడితే పోయేదేముంది.. ఒక్క ప్రాణం తప్ప అన్న నానుడిని నిజం చేస్తూ, గన్నుకు గన్ను పట్టి బదులు తీర్చుకుంటున్నారు. తాలిబన్లను ఊచకోత కోస్తున్నారు.

ఆ సాయుధ పోరాటంతోనే మళ్లీ 4 జిల్లాలను తాలిబన్ల చేతుల్లోంచి లాగేసుకున్నారు. ఉగ్రమూకను ఊపిరితీసుకోనివ్వకుండా చేస్తున్నారు. 40 మందిని హతమార్చారు. మరో 15 మందిని తీవ్రంగా గాయపరిచారు. తాలిబన్లపై తిరుగుబాటుతో తమ ఒంట్లో సత్తా చావలేదని నిరూపిస్తున్నారు. ప్రస్తుతం పులీ హిసార్, దే సలా, ఖసాన్ లను చేజిక్కించుకున్నట్టు ఆఫ్ఘనిస్థాన్ పత్రిక ఖామ నిన్న వెల్లడించింది.

అయితే, పులీ హిసార్, దే సలా, బానులను చేజిక్కించుకున్నట్టు ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి బిస్మిల్లా ముహమ్మది చెప్పారు. ఈ విషయంపై ట్వీట్ చేసిన ఆయన.. ప్రజలు తాలిబన్లపై తుపాకులతోనే పోరాడుతున్నారని చెప్పారు. ఆ తిరుగుబాటు ఇక్కడితో ఆగదని, మరింత ఉద్ధృతమవుతుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాలిబన్ల చెరలో లేని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్ షీర్ లో ఆయన ఉన్నారు.

స్థానిక పత్రిక, మాజీ రక్షణ మంత్రి చెబుతున్న ప్రకారం.. నాలుగు జిల్లాలను జనం తిరిగి చేజిక్కించుకున్నట్టవుతుంది. దీనిపై తాలిబన్ల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. మరోవైపు కాబూల్ లో తాలిబన్లు కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 తర్వాత జనాలు బయటకు రావొద్దంటూ దిక్తత్ పాస్ చేశారు.
Afghanistan
Taliban
Armed Revolt

More Telugu News