సచిన్ కు, సెహ్వాగ్ కు ఉన్న తేడా ఇదే: ముత్తయ్య మురళీధరన్

21-08-2021 Sat 12:28
  • సచిన్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాడు
  • సెహ్వాగ్, లారాలు బంతిని చితకబాదేవారు
  • సెహ్వాగ్ కోసం బౌండరీల వద్ద ఫీల్డర్లను మోహరించేవాళ్లం
Muttaiah Muralitharan reveals the difference between Sachin and Sehwag

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేసేటప్పుడు తాను భయపడేవాడిని కాదని శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ చెప్పాడు. సచిన్ ఎక్కువగా ఇబ్బంది పెట్టడని తెలిపాడు. వికెట్ కాపాడుకోవడానికి సచిన్ యత్నిస్తుంటాడని... అద్భుతమైన టెక్నిక్ తో బంతిని చక్కగా గమనించి ఆడతాడని చెప్పాడు. సెహ్వాగ్ దీనికి పూర్తిగా భిన్నమని తెలిపాడు. సెహ్వాగ్, బ్రియాన్ లారాలు బంతిని చితకబాదేవారని, బౌలర్లు బెంబేలెత్తేలా ఆడేవారని చెప్పాడు. అందుకే వీరికి బౌలింగ్ చేయడం కష్టంగా ఉండేదని తెలిపారు.

ఆఫ్ స్పిన్ ఆడటంలో సచిన్ కు కొంత బలహీనత ఉందనే విషయాన్ని తాను గమనించానని మురళి చెప్పాడు. లెగ్ స్పిన్ ను బాదేసే సచిన్... ఆఫ్ స్పిన్ లో కొంత తడబడేవాడని తెలిపాడు. అందుకే సచిన్ ను తాను చాలాసార్లు ఔట్ చేశానని చెప్పాడు. సచిన్ ను చాలా మంది ఆఫ్ స్పిన్నర్లు ఔట్ చేయడం తాను చూశానని తెలిపాడు. అయితే, ఎందుకోగానీ ఈ విషయాన్ని సచిన్ కు తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నాడు. ఇతర బౌలర్లతో పోలిస్తే సచిన్ పై తానే పైచేయి సాధించానని చెప్పాడు. అయితే, సచిన్ ను ఔట్ చేయడం అంత సులభం కాదని... సచిన్ ఒక అద్భుతమైన బ్యాట్స్ మెన్ అని కొనియాడాడు.

సెహ్వాగ్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ మెన్ అని మురళి చెప్పాడు. అతను బ్యాటింగ్ చేసేటప్పుడు బౌండరీల వద్ద, డీప్ లో తాము ఫీల్డర్లను మోహరించేవాళ్లమని తెలిపాడు. బంతిని బాదడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని సెహ్వాగ్ వదులుకోడని... తన సహజశైలి ప్రకారం బాదుతూనే ఉంటాడని చెప్పాడు. ఏ బౌలర్ పైనైనా సరే దాడి చేస్తాననే విధంగా ఆయన బ్యాటింగ్ ఉండేదని తెలిపాడు. రెండు గంటలు క్రీజ్ లో ఉంటే 150 పరుగులు, రోజంతా బ్యాటింగ్ చేస్తే 300 రన్స్ ను సెహ్వాగ్ చేయగలడని చెప్పాడు. ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ తన బౌలింగ్ ను బాగా ఎదుర్కోగలరని తెలిపాడు.