పీవీ సింధు కాంస్యం గెలిస్తే.. 'గోల్డ్ మెడల్' అంటూ ట్వీట్ చేసిన రాధిక... నెటిజన్ల విమర్శలు

20-08-2021 Fri 21:55
  • టోక్యో ఒలింపిక్స్ లో పీవీ సింధుకు కాంస్యం
  • సింధుకు సన్మాన కార్యక్రమం
  • హాజరైన మెగాస్టార్ చిరంజీవి, రాధిక
  • పసిడి గెలవడం గొప్ప అనుభూతి అంటూ రాధిక ట్వీట్
Radhika tweets PV Sindhu achievement in Tokyo Olympics

టోక్యో ఒలింపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ తార పీవీ సింధు కాంస్యం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీ సింధుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. దీనిపై రాధిక ట్వీట్ చేశారు. అయితే, పీవీ సింధు గెలిచింది స్వర్ణం పతకం అంటూ రాధిక ట్వీట్ చేశారు. 'పసిడి పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది' అంటూ రాధిక తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒలింపిక్ గోల్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు.

అయితే, నెటిజన్లు రాధిక తప్పిదాన్ని వెంటనే గుర్తించారు. మేడమ్ అది గోల్డ్ కాదు, కాంస్యం అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మరికొందరైతే బంగారం పూతపూసిన కాంస్య పతకం అంటూ ఎద్దేవా చేశారు. ఇంకొందరు ఘాటుగా స్పందిస్తూ, పీవీ సింధు ఏం గెలిచిందో కూడా తెలియకుండానే వాళ్లను కలిసి అభినందించడం వల్ల ఏమిటి ప్రయోజనం? అని నిలదీశారు.