Covid Patient: 109 రోజులు వెంటిలేటర్‌పై.. చివరకు కోలుకున్న కరోనా పేషెంట్

Covid Patient Recovers After 109 Days On Ventilator Support
  • ఇది రెండో జన్మ అన్న వ్యాపారవేత్త మహమద్ ముద్ధీజా
  • చెన్నైలోని రేలా హాస్పిటల్‌లో జరిగిన అద్భుతం
  • నెలకు రూ.40 లక్షల ఖర్చు
  • 9 నెలల తర్వాత కోలుకున్న పేషెంట్
తమిళనాడు రాజధాని చెన్నైలోని రేలా హాస్పిటల్‌లో అద్భుతం జరిగింది. కరోనా మహమ్మారితో 109 రోజులపాటు పోరాడిన అనంతరం మహమద్ ముద్దీజా(56) అనే పేషెంట్ కోలుకున్నారు. కరోనా కారణంగా ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోయాయి. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ అవసరమైంది. ఈ క్రమంలో 'ఎక్మో' (ఎక్స్‌ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సీజనైజేషన్)తో 62 రోజుల చికిత్స చేసిన తర్వాత ఆయన ఊపిరితిత్తులు పూర్తిగా నయమైనట్లు డాక్టర్లు చెప్పారు. 'ఎక్మో' అనేది కృత్రిమ ఊపిరితిత్తుల వంటిది.

మామూలుగా ఊపిరితిత్తులు పూర్తిగా చెడిపోతే ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పదు. అయితే ముద్ధీజాకు ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ఊపిరితిత్తుల కోసం వెతుకుతున్న సమయంలోనే కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చింది. దీంతో ఊపిరితిత్తులు దొరకలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను 9 వారాలపాటు ఈసీఎంవోపై ఉంచారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ లేకుండా 'ఎక్మో'పై ఇంత ఎక్కువ కాలం జీవించిన పేషెంట్‌గా ముద్దీజా రికార్డు సృష్టించారని నిపుణులు అంటున్నారు.

ఈ చికిత్సతో ఊపిరితిత్తులు పూర్తిగా బాగవడం చాలా అరుదని వైద్యులు తెలిపారు. ‘‘ఇది నా రెండో జన్మ. డాక్టర్లు చెప్పినవన్నీ చేశా. ఆపై భగవంతుడిపై భారం వేశా’’ అని మహమద్ చెబుతున్నారు. ఈ వైద్యానికి నెలకు రూ.40 లక్షలు ఖర్చవుతుందని, చాలా మంది ఈ చికిత్స తీసుకోలేరని మహమద్ కుమార్తె చెప్పింది. తండ్రి వ్యాపారవేత్త అయినా కూడా తాము వైద్యం చేయించడానికి ఇబ్బందిపడాల్సి వచ్చిందని ఆమె వివరించింది.

మహమద్ కోలుకున్న కథ కరోనాతో తీవ్రంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారిలో కొత్త ఆశలు చిగురింపజేస్తుందని వైద్యులు అంటున్నారు. 'ఎక్మో'పై ఉన్న ప్రతి పేషెంట్‌కూ ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ అక్కర్లేదని, ఈ వైద్యం కొనసాగిస్తూ ఉంటే కోలుకునే అవకాశం ఉందని రేలా ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ప్రొఫెసర్ మహమద్ రేలా తెలిపారు. కరోనా చాలా కొత్త వ్యాధని, దీనివల్ల కలిగే ఊపిరితిత్తుల డ్యామేజిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
Covid Patient
Ventilator
chennai

More Telugu News