Raghu Rama Krishna Raju: ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించమని కలెక్టర్లకు చెప్పడం ఏంటి?: రఘురామకృష్ణ రాజు

Raghurama Krishna Raju opines on AP economic situation
  • ఏపీ ఆర్థికస్థితిపై రఘురామ వ్యాఖ్యలు
  • రూ.2.56 లక్షల కోట్లు అప్పులు చేశారు  
  • 20 శాతం మందికి జీతాలు చెల్లించలేదని ఆరోపణ
  • మహిళలపై అఘాయిత్యాల నేపథ్యంలో ఆగ్రహం
ఏపీ ఆర్థిక పరిస్థితి, ఇతర అంశాలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నదని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి సంక్షేమం ఎక్కువకాలం నిలవదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం సీపీఎస్ రద్దు చేయకుండా, ఉద్యోగుల పీఎఫ్ లో కోత విధిస్తోందని ఆరోపించారు. 20వ తేదీ వచ్చినప్పటికీ ఇంకా 20 శాతం మందికి వేతనాలు చెల్లించలేదని అన్నారు.

జగన్ సర్కారు అధికారం చేపట్టాక రూ.2.56 లక్షల కోట్లు అప్పు చేశారని రఘురామ తెలిపారు. రుణాలు తెచ్చుకోవడం కోసమే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దారుణమని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపులకే ఆదాయం అంతా సరిపోతోందని వ్యాఖ్యానించారు. అందుకే ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి పప్పుబెల్లాల్లా పంచుతున్నారని విమర్శించారు. ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని కలెక్టర్లకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడంలేదంటూ రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా మనం స్త్రీలకు ఇచ్చే గౌరవం అని ఆక్రోశించారు. "గన్ కన్నా ముందు ఇంకేదో గన్ వస్తుందని మహిళా మంత్రులు చెబుతున్నారు. చట్టాలు తెచ్చాం, యాప్ లు పెట్టాం అని మాట్లాడుతున్నారు. రోజు విడిచి రోజు స్త్రీలపై జరుగుతున్న ఘటనలపై పునరాలోచించుకోవాలి" అని హితవు పలికారు.

అటు, మంత్రుల తీరుపైనా రఘురామ విమర్శలు చేశారు. సీఎం వస్తేనే మంత్రులు సచివాలయానికి వస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ సచివాలయంలో అందుబాటులో ఉండాలని కోరుతున్నామని తెలిపారు. ఏదెలాగున్నా, మరో పాతికేళ్లు వైసీపీనే అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని తన మనోభావాలను పంచుకున్నారు.
Raghu Rama Krishna Raju
Andhra Pradesh
Economy
CM Jagan
YSRCP

More Telugu News