రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన ఏపీ టీడీపీ నేతలు

20-08-2021 Fri 18:35
  • జీవోల ఆఫ్ లైన్ వ్యవహారంపై చర్చ
  • బ్లాంక్ జీవోలపై గవర్నర్ కు ఫిర్యాదు
  • జీవోలు వెబ్ సైట్ లో పెట్టడంలేదని వెల్లడి
  • రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని ఆరోపణ
TDP leaders met governor at Raj Bhavan

ఏపీ టీడీపీ నేతలు విజయవాడ రాజ్ భవన్ లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. వర్ల రామయ్య, బోండా ఉమ, బచ్చుల అర్జునుడు గవర్నర్ ను కలిసి జీవోల ఆఫ్ లైన్ అంశంపై చర్చించారు. వెబ్ సైట్ లో జీవోలు ఉంచకూడదన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందిస్తూ, ప్రభుత్వం బ్లాంక్ జీవోలు ఇచ్చేందుకు వీలులేదని స్పష్టం చేశారు. జీవోలను ఆన్ లైన్ లో ఉంచకుండా తేదీ, నెంబరు వేసి వదిలేస్తున్నారని ఆరోపించారు. రాత్రిపూట రహస్య జీవోలు విడుదల చేస్తున్నారని వివరించారు. జీవోలు ఆన్ లైన్ లో పెడతారో లేదో చూసి వారం తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వర్ల రామయ్య స్పష్టం చేశారు.

బోండా ఉమ మాట్లాడుతూ, తాము బ్లాంక్ జీవోలపై ఫిర్యాదు చేయగానే ఆన్ లైన్ లో జీవోలు తీసేశారని వెల్లడించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.