Muralidhar Rao: కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే: బీజేపీ నేత మురళీధర్ రావు

  • ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదు
  • ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతింది
  • కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారు
KCR govt to be pulled down says  Muralidhar Rao

గత ఏడేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టిస్తోందని బీజేపీ నేత మురళీధర్ రావు విమర్శించారు. ప్రభుత్వం సరైన దారిలో వెళ్లడం లేదని... రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ సహకారం ఉందని... అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉందని తెలిపారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణలో... ఉద్యమాలపై లాఠీ దెబ్బలు పెరిగాయని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పారు.

యువతకు ఉద్యోగావకాశాలు దెబ్బతిన్నాయని.. ఓయూలాంటి యూనివర్శిటీల్లో కూడా 80 శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మురళీధర్ రావు విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా టైమ్ కి రావడం లేదని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ల విషయంలో కూడా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని... 2019 నాటికి 2.70 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని... కానీ ఇప్పటి వరకు 30 వేలు మాత్రమే పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ పాలనలో దళితులు పూర్తిగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాలిబన్ మద్దతుదారులు, రాజకీయ నాయకులు ఉన్నారని... టీఆర్ఎస్ పార్టీతో కలిసి వారు రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

More Telugu News