అసదుద్దీన్ ఒవైసీని ఆఫ్ఘ‌నిస్థాన్‌కు పంపితే బాగుంటుంది: కేంద్ర స‌హాయ మంత్రి శోభ‌

20-08-2021 Fri 13:39
  • భార‌త్‌లో మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఒవైసీ వ్యాఖ్య‌లు
  • కేంద్ర స‌ర్కారు మాత్రం ఆఫ్ఘ‌న్‌లోని దాడుల‌పై ఆందోళ‌న ప్ర‌క‌టిస్తోంద‌ని విమ‌ర్శ‌
  • అస‌ద్‌ను ఆఫ్ఘ‌న్ కు పంపితే అక్క‌డి మ‌హిళ‌ల‌ను కాపాడ‌తార‌ని శోభ ఎద్దేవా
It is better to send Asaduddin Owaisi to Afghanistan to protect their women and their community Union Minister Shobha
భార‌త్‌లో ప‌రిస్థితులను ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని ప‌రిస్థితుల‌తో పోల్చుతూ హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. 'ఓ నివేదిక ప్ర‌కారం.. దేశంలో ఐదేళ్ల‌ వ‌య‌సు నిండకుండానే ప్ర‌తి తొమ్మిది మంది ఆడ‌పిల్ల‌ల్లో ఒక‌రు మృతి చెందుతున్నారు. భార‌త్‌లో మ‌హిళ‌లపై దాడులు, నేరాలు జ‌రుగుతున్నాయి. కానీ, కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై కాకుండా ఆఫ్ఘ‌నిస్థాన్‌లోని మ‌హిళ‌ల ప‌రిస్థితిపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. మ‌న దేశంలో మ‌హిళ‌ల‌పై దారుణాలు జ‌ర‌గ‌డం లేదా?' అని ఓ కార్య‌క్ర‌మంలో అస‌దుద్దీన్ వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై కేంద్ర స‌హాయ మంత్రి శోభ‌ కరంద్లాజే స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'ఆఫ్ఘ‌నిస్థాన్‌లో వారి మ‌హిళ‌ల‌ను, క‌మ్యూనిటీని ర‌క్షించేందుకు అస‌దుద్దీన్‌ ఒవైసీని ఆ దేశానికి పంపితే బాగుంటుంది' అంటూ చుర‌క‌లంటించారు.