నిన్న ఆఫ్ఘ‌నిస్థాన్‌ నుంచి 3,000 మందిని విమానాల్లో తరలించిన అమెరికా

20-08-2021 Fri 12:38
  • సెప్టెంబరు 11 నాటికి ఆఫ్ఘన్ నుంచి బ‌ల‌గాలు పూర్తిగా ఉప‌సంహ‌ర‌ణ‌
  • ఇప్ప‌టివ‌ర‌కు ఆఫ్ఘ‌న్ నుంచి అమెరికాకు 14,000 మంది
  • ఆఫ్ఘ‌న్‌లో త‌మ‌కు స‌హ‌క‌రించిన వారికీ అమెరికా ర‌క్ష‌ణ‌
we have evacuated approximately 14000 people says a White House official
తాలిబ‌న్ల‌తో చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం ఈ ఏడాది సెప్టెంబరు 11 నాటికి ఆఫ్ఘన్ నుంచి త‌మ బ‌ల‌గాల‌ను పూర్తిగా వెన‌క్కి ర‌ప్పించాల‌ని అమెరికా నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే అధిక శాతం బలగాల ఉపసంహరణ జ‌రిగింది. కొద్ది మంది అమెరికా సైనికులు మాత్ర‌మే ప్ర‌స్తుతం ఆఫ్ఘ‌న్‌లో ఉన్నారు. అమెరికాపై ఉగ్ర‌వాదులు 2001, సెప్టెంబరు 11న ఉగ్రదాడికి పాల్పడి 20 ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా ఆ రోజు నాటికి అమెరికా బ‌ల‌గాల‌న్నీ ఆఫ్ఘ‌న్‌ను వీడ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో నిన్న ఒక్కరోజే కాబూల్ విమానాశ్ర‌యం నుంచి 16 సీ-17 విమానాల ద్వారా దాదాపు 3,000 మందిని అమెరికాకు తీసుకెళ్లిన‌ట్లు తెలిపారు. వారిలో 350 మంది అమెరికా పౌరులు కూడా ఉన్నార‌ని చెప్పారు. దీంతో జులై చివ‌రి వారం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 14,000 మందిని అమెరికాకు తరలించినట్టు శ్వేత‌సౌధం అధికారులు ఈ రోజు ప్ర‌క‌టించారు.

ఇక అమెరికా పౌరు‌ల‌నే కాకుండా ఆఫ్ఘ‌న్‌లో అమెరికా, నాటో ద‌ళాల‌కు స‌హ‌క‌రించిన వారి కుటుంబాల‌ను, ప్ర‌త్యేక వీసాలు ఉన్నవారిని కూడా కాబూల్ నుంచి తీసుకెళ్తున్నారు. గ‌త 24 గంటల్లో అద‌నంగా 11 చార్ట‌ర్ విమానాల‌ను కూడా వాడిన‌ట్లు శ్వేత‌సౌధం అధికారులు పేర్కొన్నారు.