Afghanistan: అందుకే ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి సైనికుల‌ను వెన‌క్కు ర‌ప్పించాం: అమెరికా అధ్య‌క్షుడు బైడెన్

  • తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయి
  • ముందు వాటిని నియంత్రించాలి
  • ఎక్కడ ముప్పు ఉందో అక్కడే దృష్టి పెడుతున్నాం
  • సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదులు ఉన్నారు
biden on afghan situation

ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా, నాటో ద‌ళాలు వెన‌క్కి వెళ్తున్న నేప‌థ్యంలో తాలిబ‌న్లు దేశాన్ని ఆక్రమించి రెచ్చిపోతుండ‌డంతో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై బైడెన్ స్పందిస్తూ త‌మ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు. తాలిబన్ల కంటే ప్రమాదకర శక్తులు ఉన్నాయని ఆయ‌న పేర్కొన్నారు. ముందు వాటిని నియంత్రించడానికే తాము ఆప్ఘ‌న్‌ నుంచి వైదొలుగుతున్నామ‌ని తెలిపారు.

ఆ దేశం నుంచి ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించి, ముందు ఎక్కడ ఎక్కువ ముప్పు ఉందో అక్కడే దృష్టి పెడుతున్నామ‌ని చెప్పారు. ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్లు మాత్ర‌మే కాకుండా సిరియా, తూర్పు ఆఫ్రికా దేశాల్లో అల్‌ఖైదా, ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదులు ప్రాబల్యం పెంచుకున్నారని తెలిపారు. ఆ ఉగ్ర‌సంస్థ‌ల‌కు అడ్డుకట్ట వేయాల్సి ఉంద‌ని చెప్పారు.

అయితే, ఆఫ్ఘ‌న్ మొత్తాన్ని ఊహించిన దానికంటే వేగంగా తాలిబన్లు వ‌శం చేసుకోవ‌డంపై ఆయ‌న ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా, ఆఫ్ఘ‌న్‌లో త‌మ‌కు సాయ‌ప‌డ్డ సుమారు 30 వేల మంది శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇవ్వ‌నుంది. అమెరికా ద‌ళాల‌కు సాయం చేసిన ఆఫ్ఘ‌న్లు ఇప్పుడు తాలిబ‌న్లు త‌మ‌ను ఏం చేస్తారోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ప‌లువురిని తాలిబ‌న్లు చంపేశారు. అమెరికాకు సాయం చేసిన వారిని గుర్తించేందుకు ఇంటింటికి వెళ్తూ త‌నిఖీలు చేస్తున్నారు.

More Telugu News