Bandla Ganesh: 'మా'కు ఇప్పుడు సొంత బిల్డింగ్ అవసరం లేదు: బండ్ల గణేశ్

Bnadla Ganesh said no need of own building for MAA
  • వచ్చే నెలలో 'మా' ఎన్నికలు
  • అధ్యక్ష పదవి రేసులో ఐదుగురు
  • 'మా' బిల్డింగే అందరి అజెండా
  • బిల్డింగ్ కు తాను వ్యతిరేకినన్న బండ్ల

టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది. వచ్చే నెలలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్నాయి. 'మా'కు సొంత భవనం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ వంటి ప్రముఖులు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అందరి నోట 'మా'కు సొంత భవనం మాటే వినిపిస్తోంది. దీనిపై నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు.

 ఇప్పుడున్న పరిస్థితుల్లో 'మా'కు సొంత భవనం నిర్మించడం కంటే ఆ డబ్బుతో పేద కళాకారులకు సాయం చేయడం సబబుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 'మా'లో దాదాపు 900 మంది వరకు సభ్యులు ఉన్నారని, వారిలో 150 మంది వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండ్ల గణేశ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో, 'మా'కు సొంత భవనం కట్టేందుకు అవసరమయ్యే రూ.20 కోట్ల ఖర్చుతో పేద ఆర్టిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.

'మా'కు సొంత భవనం లేనందువల్ల చిత్ర పరిశ్రమకు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఏదీ ఆగిపోదని అన్నారు. 'మా'కు సొంత బిల్డింగ్ నిర్మాణానికి తాను వ్యతిరేకం అని బండ్ల గణేశ్ ఉద్ఘాటించారు. బండ్ల గణేశ్ 'మా' ఎన్నికల తరుణంలో ప్రకాశ్ రాజ్ వర్గానికి మద్దతు పలుకుతున్నారు. 'మా'ను ఆయన మరింత ముందుకు తీసుకెళతాడన్న నమ్మకం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News