COVID19: వ్యాక్సిన్​ రెండు డోసులేసుకున్నా.. 87 వేల మందికి కరోనా!

  • ఒక్క కేరళలోనే 46 శాతం మందికి
  • కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల కలవరం
  • 200 శాంపిళ్ల జన్యు క్రమ విశ్లేషణ
  • ఎలాంటి పరివర్తనల్లేవని గుర్తింపు
87000 people who administered second dose of vaccine infected with Covid

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికీ మహమ్మారి సోకుతోంది (వీటినే బ్రేక్ త్రూ కేసులంటారు). దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న 87 వేల మందికి కరోనా వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అందులో ఒక్క కేరళలోనే దాదాపు 46 శాతం మంది దాకా ఉన్నారని అంటున్నారు.

కేరళలో మొదటి డోసు తీసుకున్న 80 వేల మందికి కరోనా సోకగా.. రెండు డోసులు తీసుకున్న 40 వేల మంది దాని బారిన పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసుల్లో కేరళలోనే అత్యధికంగా వస్తుండడం, ఇప్పుడు బ్రేక్ త్రూ కేసులూ ఆ రాష్ట్రంలోనే ఎక్కువగా నమోదవుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన 200 బ్రేక్ త్రూ కేసుల శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. అయితే, ఆ శాంపిళ్లలో ఎలాంటి జన్యుపరివర్తన జరిగిన కరోనా మూలాలు లేవని తేల్చారు. కేరళలో బ్రేక్ త్రూ కేసులు పెరిగిపోతుండడంతో.. దాని పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులపైనా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

More Telugu News