యువతుల వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్యాయత్నం!

19-08-2021 Thu 08:39
  • వరంగల్ జిల్లా రాయపర్తిలో ఘటన
  • ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువకుడు
  • ప్రియురాలి మరణానికి కారణం నువ్వేనంటూ యువతుల వేధింపులు
  • పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
Young Boy attempt to Suicide after girls Harassment
యువతుల వేధింపులు భరించలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మొరిపిరాలకు చెందిన సందీప్ మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం అయింది. అందులో ఒకరిపై సందీప్ ప్రేమలో పడ్డాడు.

ఇటీవల మిగతా ఇద్దరు యువతులు సందీప్‌కు ఫోన్ చేసి ప్రియురాలు చనిపోయిందని, అందుకు కారణం నువ్వేనంటూ బెదిరించారు. ఈ నెల 12న మరోమారు ఫోన్ చేసిన యువతులు సందీప్‌ను బెదిరించారు. దీంతో భయపడిపోయిన యువకుడు స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.