Corona Virus: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసింది: తెలంగాణ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్

  • కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది
  • సీజనల్ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం
  • పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేశాం
Corona second wave ended in Telangana

తెలంగాణలో కరోనా చాలా వరకు నియంత్రణలోకి వచ్చిందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ముగిసిపోయిందని చెప్పారు. అన్ని జ్వరాలను కరోనా వల్ల వచ్చే జ్వరంగా భావించవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని... అయితే ఈ వ్యాధులు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దోమలు, లార్వా అభివృద్ధి చెందకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కొన్ని జిల్లాల్లో మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయని తెలిపారు.

హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో డెంగీ కేసులు వచ్చాయని శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,200 డెంగీ కేసులు వచ్చాయని ఎవరికైనా జ్వరం, విరేచనాలు, కళ్లు తిరగడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. పెద్ద ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు పని చేస్తున్నాయని చెప్పారు. డెంగీ చికిత్స కోసం 24 ప్లేట్ లెట్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు.  

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.65 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించామని శ్రీనివాస్ వెల్లడించారు. 56 శాతం మందికి తొలి డోస్, 34 శాతం మందికి రెండో డోస్ పూర్తయిందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 90 శాతం మంది ప్రజలకు తొలిడోసు వేశామని తెలిపారు.

More Telugu News