Afghanistan: మాజీ అధ్యక్షుడు హమీద్​ కర్జాయ్​ తో తాలిబన్ల భేటీ.. జలాలాబాద్​ లో జనంపైకి తాలిబన్ల కాల్పులు: వీడియో ఇదిగో

Taliban Faction Meets Afghan Ex President Hamid Karzai
  • ప్రభుత్వ ఏర్పాటుపై కర్జాయ్ తో చర్చ
  • మహిళల హక్కులు కాపాడతామని హామీ
  • ప్రభుత్వ ఆఫీసులపై దేశ జెండా పెట్టాలంటూ నిరసన
  •  బడిబాట పట్టిన అమ్మాయిలు
ఆఫ్ఘనిస్థాన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఇక, ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ తో తాలిబన్ అగ్రనేతలు సమావేశమయ్యారు. అనాస్ హక్కానీ నేతృత్వంలోని తాలిబన్ నేతలు ఆయనతో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

ఇస్లామిక్ చట్టాలకు లోబడి మహిళల హక్కులను కాపాడతామని వారు హామీ ఇచ్చారు. ఇకపై తాలిబన్ నేతలెవరూ చీకట్లో దాక్కోరని, ప్రపంచం ముందుకు వస్తారని తాలిబన్ నేత ఒకరు చెప్పారు. కాగా, తాలిబన్లు భారీగా అమెరికా రక్షణ వ్యవస్థలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు.

మరోవైపు తజకిస్థాన్ లోని ఎంబసీలో మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఫొటోను తీసేసి.. ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ ఫొటోను పెట్టారు. ప్రస్తుతానికి తాను ఆపద్ధర్మ అధ్యక్షుడినంటూ ఆయన ట్వీట్ చేసిన సంగతి విదితమే. కాగా, ప్రభుత్వ ఆఫీసులపై ఆఫ్ఘనిస్థాన్ జెండాలను పెట్టాలని జలాలాబాద్ లో జనం ఆందోళన చేయగా.. తాలిబన్లు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో కొందరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

మరోపక్క, హెరాత్ లో ఆడపిల్లలు బడిబాట పట్టారు. మొహానికి తెల్లటి ముసుగు ధరించి పాఠశాలకు వెళ్లారు. ఇతర దేశాల ఆడపిల్లల్లాగే తమకూ ఎదగాలని ఉందంటూ రోఖియా అనే విద్యార్థిని చెప్పుకొచ్చింది. తాలిబన్లు అందుకు అండగా ఉంటారని అనుకుంటున్నామంది. తమకు దేశంలో యుద్ధం వద్దని, శాంతి కావాలని చెప్పింది.
Afghanistan
Hamid Karzai
Taliban
Schools
Jalalabad

More Telugu News