Supreme Court: నేషనల్ డిఫెన్స్​ అకాడమీలో ఇక మహిళలకూ అవకాశం.. సుప్రీం గ్రీన్ సిగ్నల్.. లింగ వివక్ష చూపిస్తున్నారంటూ ఆర్మీపై ఆగ్రహం!

  • ఎన్డీయే ప్రవేశ పరీక్షకు అనుమతి
  • కోర్టు ఆదేశాలకు లోబడే ప్రవేశాలు
  • వచ్చే నెల 5న ఎన్డీయే పరీక్ష
  • ఆలోచనా విధానమే అసలు సమస్యంటూ మండిపాటు
Women Candidates Can Appear For NDA Entrance Orders Supreme Court

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీయే) ప్రవేశ పరీక్షలో మహిళలకు అవకాశం కల్పించకపోవడంపట్ల భారత సైన్యంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఆర్మీ విధాన నిర్ణయాలు లింగ వివక్షను చూపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చేనెల 5న నిర్వహించే ఎన్డీయే ప్రవేశ పరీక్షను మహిళలూ రాయవచ్చని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చే తుది ఆదేశాలకు అనుగుణంగానే ప్రవేశాలను నిర్వహించాల్సిందిగా ఆర్మీని ఆదేశించింది.

ఎన్డీయే ప్రవేశ పరీక్షకు అమ్మాయిలనూ అనుమతించాలని పేర్కొంటూ కుష్ కల్రా అనే వ్యక్తి పిటిషన్ ను దాఖలు చేశారు. అర్హులైన మహిళలను ఎన్డీయేలో చేరనివ్వకుండా రాజ్యాంగంలోని 14, 15, 16, 19 అధికరణాలను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. మహిళల పట్ల ఎక్కడా వివక్ష చూపించట్లేదని కేంద్రం వాదించింది. సాయుధ దళాల్లోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపింది. వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించట్లేదని స్పష్టం చేసింది.

‘‘మీ ఆలోచనా విధానమే అసలు సమస్య. ప్రభుత్వం వెంటనే దానిని మార్చుకుంటే మంచిది. మేం ఆదేశాలిచ్చే వరకు తెచ్చుకోవద్దు’’ అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలను కల్పించాల్సిందేనని, ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే మార్చాలని ఆదేశించింది. అవకాశాలను కల్పించాలని జస్టిస్ చంద్రచూడ్ తీర్పునిచ్చినా అమలు చేయరా? అని జస్టిస్ ఎస్కే కౌల్ ప్రశ్నించారు. ఆర్మీలో మహిళలకు అవకాశాల కోసం పర్మనెంట్ కమిషన్ వేయాలన్న జస్టిస్ ఆదేశాలను అమలు చేయరా? అంటూ నిలదీశారు.

కాగా, ఈ పిటిషన్ తో పాటు డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్ లో ఈ ఏడాది నుంచి అమ్మాయిలకు ప్రవేశాలను కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ నూ సుప్రీంకోర్టు విచారించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆ కాలేజీలో ప్రస్తుతం కేవలం అబ్బాయిలకే ప్రవేశాలను నిర్వహిస్తున్నారు.

More Telugu News