Corona Virus: పసివాళ్ల నుంచి కరోనా ముప్పు అధికం!: తాజా అధ్యయనంలో వెల్లడి

  • పసివాళ్ల నుంచి ఇతరులకు వైరస్ సోకే ప్రమాదం 43 శాతం అధికం
  • కెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ సర్వేలో వెల్లడి
  • జామా పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురితం
Babies and toddlers spread coronavirus in homes more easily

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కెనడాకు చెందిన హెల్త్ ఏజెన్సీ ఒక సర్వే చేసింది. దీనిలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ సోకే ప్రమాదం 14-17 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉంటుందని, 0-3 ఏళ్ల వయసున్న పిల్లలకు కరోనా సోకే ప్రమాదం తక్కువని ఈ సర్వే తేల్చింది. అయితే ఒకసారి పసివాళ్లకు కరోనా సోకితే మాత్రం.. పసివాళ్ల నుంచి ఇది ఇతరులకు వ్యాపించే అవకాశం 43 శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.

దీన్ని అర్థం చేసుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా పసివాళ్లకు కరోనా సోకితే వారిని ఐసోలేట్ చేయలేమని, ఎవరో ఒకరు వారి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో పిల్లల కేర్‌గివర్స్, తోబుట్టువులకు కరోనా సోకే ప్రమాదం ఉందనేది నిపుణుల అభిప్రాయం.

ప్రముఖ జామా పీడియాట్రిక్స్‌ జర్నల్‌లో ఈ సర్వే వివరాలు ప్రచురితమయ్యాయి. కరోనా సోకిన చిన్నారుల వల్ల వైరస్ వేగంగా వ్యాపిస్తుందా? లేక పెద్ద వారి వల్ల వ్యాపిస్తుందా? అనే అంశంపై ఇప్పటికే అంతర్జాతీయంగా ఒక వాదన నడుస్తోంది. ఈ తాజా సర్వే ఈ వాదనకు సమాధానం ఇవ్వలేదు. అయితే 14-17 ఏళ్ల వయసు పిల్లలకు బయట కరోనా సోకే అవకాశం ఉందని, ఇది 0-3 సంవత్సరాల వయసున్న పిల్లల్లో చాలా తక్కువ అని సర్వేలో తేలింది.

అదే సమయంలో 14-17 ఏళ్ల పిల్లల నుంచి తక్కువ మందికి వైరస్ సోకితే, 0-3 సంవత్సరాల పిల్లల నుంచి ఎక్కువ మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని ఈ సర్వేలో తేల్చింది.

More Telugu News