తెలంగాణ నీటిని ఏపీ దోచుకుపోతోంది... ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

17-08-2021 Tue 17:35
  • జలవివాదాలపై స్పందించిన బండి సంజయ్
  • రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రస్తావన
  • అక్రమంగా నీటి తరలింపుకేనని ఆరోపణ
  • సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించలేదని అసంతృప్తి
Bandi Sanjay wrote Telangana CM KCR over water issue

తెలుగు రాష్ట్రాల నీటి కేటాయింపుల అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు సుదీర్ఘ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మిస్తూ తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుపోతోందని ఆరోపించారు. ఏపీ దోపిడీని అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇటీవల రాయలసీమ ప్రాజెక్టును సందర్శించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)... ఏపీ దాదాపుగా పనులు పూర్తిచేసిందని ఎన్జీటీ చెన్నై బెంచ్ కు నివేదిక ఇచ్చిందని వెల్లడించారు.

శ్రీశైలం జలాశయం నుంచి అక్రమంగా నీటిని తరలించడానికే ఏపీ గత ఏడాదిగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా, సీఎం కేసీఆర్ సకాలంలో స్పందించడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎంకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. తన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి వాస్తవ పరిస్థితిని తెలంగాణ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.