Sunil Gavaskar: ఇంగ్లండ్ కేవలం ఇద్దరు ఆటగాళ్ల జట్టు: సునీల్ గవాస్కర్ విశ్లేషణ

  • జోరూట్, జిమ్మీ ఆండర్సన్ మాత్రమే ఉన్నారు
  • అది ఒక జట్టులానే కనిపించడం లేదంటూ ఎద్దేవా 
  • భారత్ 4-0తో సిరీస్ గెలుస్తుందన్న గవాస్కర్
England is a two man team says Gavaskar

లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. రెండో ఇన్నింగ్సులో నిప్పులు చెరిగిన భారత పేస్ దళం ఇంగ్లండ్ బ్యాటింగ్ నడ్డివిరిచింది. దీంతో 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 120 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం భారత లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్.. ఇంగ్లండ్ జట్టుపై విమర్శల వర్షం కురిపించాడు. అది ఒక జట్టులానే కనిపించడం లేదని అన్నారు.

‘ఇంగ్లండ్ కేవలం ఇద్దరి జట్టు. ఆ జట్టులో జో రూట్, జిమ్మి ఆండర్సన్ మాత్రమే ఉన్నారు. మిగతా ఆటగాళ్లకూ పూర్తి గౌరవం ఇస్తున్నా.. కానీ ఇది ఒక సరైన టెస్టు జట్టులా కనిపించడం లేదు’ అంటూ గవాస్కర్ వ్యాఖ్యానించారు. కాబట్టి సిరీస్‌లో మిగిలిన మూడు మ్యాచులను కూడా భారత్ గెలుస్తుందని చెప్పారు. సిరీస్‌ ఆరంభంలోనే తాను ఈ విషయం చెప్పానని, ఇప్పటికీ తాను అదే నమ్ముతున్నానని అన్నారు. వర్షం కనుక అంతరాయం కలిగించకపోతే.. భారత్ ఈ సిరీస్‌ను 4-0 లేదంటే 3-1తో తన ఖాతాలో వేసుకుంటుందని గవాస్కర్ జోస్యం చెప్పారు.

ఇక ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ టెక్నిక్ చాలా ఘోరంగా ఉందన్న గవాస్కర్.. వారి ఓపెనర్ల బ్యాటింగ్ టెక్నిక్ అధ్వానంగా ఉందని చెప్పారు. మూడో స్థానంలో వచ్చిన హసీబ్ హమీద్ చాలా నెర్వస్‌గా కనిపించాడని, ఇక మిగిలింది రూట్ మాత్రమే అని, జానీ బెయిర్‌స్టో ఆడితే ఆడతాడు లేదంటే లేదని గవాస్కర్ వివరించారు.

ఇక బట్లర్ విషయానికొస్తే.. అతను వైట్‌బాల్ క్రికెట్ అంటే వన్డే, టీ20ల్లో మంచి ఆటగాడే కానీ, రెడ్ బాల్ క్రికెట్‌ (టెస్టు క్రికెట్)లో అతను అంత అద్భుతంగా ఆడతాడని తాను అనుకోవడం లేదని లిటిల్ మాస్టర్ తెలిపారు. ఇంగ్లండ్ బౌలింగ్ దళాన్ని కూడా గవాస్కర్ తప్పుబట్టారు. మహమ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా ఇద్దరూ రికార్డు స్థాయిలో 9వ వికెట్‌కు 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంగ్లండ్ బౌలర్లను గవాస్కర్ విమర్శించారు.

బౌలింగ్ విషయంలో ఇంగ్లండ్ వద్ద జిమ్మీ ఆండర్సన్ మాత్రమే ఉన్నాడని, అతను కాకుండా ఇంకే బౌలరూ ఇంగ్లండ్ అమ్ములపొదిలో లేడని తేల్చేశారు. ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన టెస్టులో రాబిన్సన్ ఐదు వికెట్లు తీయడం గురించి మాట్లాడుతూ.. అతన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇంగ్లండ్ రెండున్నర ఆటగాళ్ల జట్టని సునీల్ గవాస్కర్ ఎద్దేవా చేశారు. 

More Telugu News