Afghanistan: తీవ్ర ఉత్కంఠ... తాలిబన్ల నిఘా మధ్యే కాబూల్ నుంచి రెండు భారీ విమానాల ద్వారా భారత సిబ్బంది తరలింపు!

  • రెండు సీ17 విమానాల ద్వారా ఎంబసీ, ఐటీబీపీ పోలీసుల తరలింపు
  • నిన్న ఒక విమానం, ఈ ఉదయం రెండో విమానంలో తరలింపు
  • అమెరికా సాయం కూడా తీసుకున్న భారత్
How India Evacuated Its Staff when Talibans watching

ఆఫ్ఘనిస్థాన్ లోని ఇండియన్ ఎంబసీ ఉద్యోగులను, అక్కడున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులను భారత్ సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. వారిని తీసుకు రావడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రెండు సీ17 భారీ విమానాలు నిన్న కాబూల్ కు వెళ్లాయి. అయితే కాబూల్ మొత్తం తాలిబన్ల గుప్పిట్లో ఉన్న తరుణంలో వీరిని అక్కడి నుంచి తరలించడం పెద్ద సవాల్ గా మారింది. తాజాగా ఈ తరలింపు ప్రక్రియ ఎలా కొనసాగిందనే వివరాలు బయటకు వచ్చాయి.

ఆగస్ట్ 15 రాత్రికి కాబూల్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ఈ పరిస్థితుల్లో తరలింపు ప్రక్రియ ఏమాత్రం వీలు కాదు. అంతేకాదు ఇండియన్ ఎంబసీ ఉన్న హై సెక్యూరిటీ గ్రీన్ జోన్ పై తాలిబన్లు పూర్తి నిఘా ఉంచారు. ఈ జోన్ లోనే అనేక దేశాలకు చెందిన ఎంబసీలు ఉన్నాయి. మరోవైపు ఇండియాకు వెళ్లే ఆఫ్ఘన్లకు వీసాలను ప్రాసెస్ చేసే షాహిర్ వీసా ఏజెన్సీ పై కూడా తాలిబన్లు రెయిడ్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో 45 మందితో కూడిన తొలి బ్యాచ్ ను తొలి ఎయిర్ ఫోర్స్ విమానం ద్వారా నిన్న తరలించారు. అయితే వీరి తరలింపు అంత ఈజీగా జరగలేదు. వీరిని ఎయిర్ పోర్టుకు తీసుకొస్తున్న సమయంలో మార్గమధ్యంలో తాలిబన్లు ఆపేశారు. అయితే మన ఎంబసీ సిబ్బంది వద్ద ఉన్న వస్తువులను మాత్రం లాక్కుని ఎయిర్ పోర్టుకు పంపించారు. వీరంతా కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకునే సరికి... అక్కడి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేలాది మంది ఆఫ్ఘన్లు విమానాశ్రయంలో కిక్కిరిసిపోయి ఉన్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానంలో ఎక్కడికైనా వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవడానికి వారంతా సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి విమానం కాబూల్ నుంచి బయల్దేరింది.

మరోవైపు కాబూల్ లో మిగిలిపోయిన వారిని నిన్న అక్కడి నుంచి తరలించేందుకు వీలు కాలేదు. ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గాలను మూసివేయడంతో పాటు... ఎయిర్ పోర్టు వద్ద పెద్ద సంఖ్యలో గుంపులు గుంపులుగా జనాలు ఉండటంతో రెండో బ్యాచ్ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొనీ బ్లింకెన్ తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్ ద్వారా చర్చలు జరిపారు. చర్చల ఫలితంగా మన వారు ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు అమెరికా బలగాలు సహకరించాయి.

ఈ క్రమంలో, అమెరికా బలగాల సాయంతో మిగిలిన ఎంబసీ సిబ్బందిని ఈ ఉదయం కాబూల్ ఎయిర్ పోర్టుకు తరలించారు. నిన్న రాత్రి కాబూల్ లోనే ఉండిపోయిన దాదాపు 120 మందికి పైగా సిబ్బంది (భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ సహా)ని తీసుకుని సీ17 ఎయిర్ ఫోర్స్ విమానం కాబూల్ నుంచి బయల్దేరింది. గుజరాత్ లోని జామ్ నగర్ లో సురక్షితంగా ల్యాండ్ అయింది. రెండు భారీ విమానాల ద్వారా ఎంబసీ సిబ్బంది మొత్తం క్షేమంగా భారత్ కు చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విధంగా తరలింపు ప్రక్రియ సుఖాంతమయింది.

More Telugu News