సుప్రీంకోర్టు ఆవరణలో యువతీ యువకుల ఆత్మహత్యాయత్నంతో కలకలం

17-08-2021 Tue 08:18
  • ఆత్మహత్యాయత్నానికి ముందు సెల్ఫీ వీడియో
  • అత్యాచార బాధితురాలినైన తనను చరిత్రహీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ
  • ఎంపీని రక్షించేందుకు న్యాయమూర్తి కూడా తనను వేధిస్తున్నారని వాపోయిన బాధితురాలు
Couple suicide attempt in the premises of supreme court
సుప్రీంకోర్టు ప్రాంగణంలో స్త్రీపురుషులిద్దరు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. యూపీకి చెందిన వీరిద్దరూ వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నారు. సమీపంలోనే ఉన్న పోలీసులు మంటలు ఆర్పి వారిని ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు బాధితులిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు. మహిళ మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలినైన తనను యూపీ పోలీసులు చరిత్ర హీనురాలిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

రాజకీయ నేతలు, పోలీసులు కుమ్మక్కై తనను వేధిస్తున్నారని  వాపోయింది. వారి వేధింపులు తాళలేకే ఈ  నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. హిస్టరీ షీటర్ (నేర చరిత కలిగిన వ్యక్తి) అయిన ఓ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్న ఆమె.. ఎస్పీ, పోలీసులు, రాజకీయ నేతలు, ప్రయాగ్‌రాజ్ కోర్టు న్యాయమూర్తి కలిసి తనను వేధిస్తున్నారని ఆరోపించింది. గత నెల 9న తాను కోర్టుకు ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అందులో పేర్కొన్న వారితో పోలీసులు కుమ్మక్కై తనపైనే తిరిగి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారని ఆరోపించారు.