లార్డ్స్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ

16-08-2021 Mon 23:36
  • 151 పరుగుల తేడాతో కోహ్లీ సేన విన్
  • నిప్పులు చెరిగిన భారత బౌలర్లు
  • 120 రన్స్ కు కుప్పకూలిన ఇంగ్లండ్
  • సిరీస్ లో భారత్ ముందంజ
Team India victorious in Lords against England
క్రికెట్ కు పుట్టినిల్లు ఇంగ్లండ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. అందునా, క్రికెట్ మక్కాగా పేరుగాంచిన విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఆతిథ్య జట్టును 151 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ 120 పరుగులకే కుప్పకూలింది. సిరాజ్ 4 వికెట్లతో ఇంగ్లండ్ భరతం పట్టాడు. బుమ్రాకు 3, ఇషాంత్ కు 2, షమీకి ఓ వికెట్ లభించాయి.

ఓ దశలో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్లు కోల్పోగా, మరో పది ఓవర్లు కాచుకుంటే మ్యాచ్ డ్రాగా ముగుస్తుందన్న నేపథ్యంలో బుమ్రా... రాబిన్సన్ (9) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో బట్లర్ (25), ఆండర్సన్ (0) లను అవుట్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు.

ఈ మ్యాచ్ లో భారత్ తొలిఇన్నింగ్స్ లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 391 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ కు 27 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించినా, అదేమంత ప్రయోజనం కలిగించలేదు. ఇక భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 298 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. టీమిండియా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఆగస్టు 25 నుంచి హెడింగ్లే వేదికగా జరగనుంది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.