refrigerator: అదృష్టమంటే ఇదే.. ఆన్‌లైన్‌లో కొన్న ఫ్రిడ్జ్‌లో దొరికిన రూ.96 లక్షలు!

  • శుభ్రం చేస్తుండగా బయటపడిన డబ్బు
  • నావి కావంటూ పోలీసులకు అప్పగించిన వ్యక్తి
  • దక్షిణ కొరియాలో ఘటన
Money found in fridge

ప్రస్తుత ప్రపంచంలో డబ్బే బలం, బలగం. డబ్బు వస్తుందంటే ఎంతదూరమైనా పోయేవారే ఎక్కువ. ఆ డబ్బు కోసం అనేక మంది తప్పుడు దారులు కూడా తొక్కుతుంటారు. అదే డబ్బు మనం ఏం చేయకుండా, దానంతట అదే వచ్చి మన ఇంట్లో చేరితే.. ఆ ఆనందానికి అవధులుండవు.

ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి సంపాదించే డబ్బు మన ఇంటికి ఫ్రీగా వచ్చేస్తే అంతకన్నా ఇంకేం కావాలి? అలా జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఆ అదృష్టం కోటిలో ఒక్కరిని మాత్రమే వరిస్తుంది. ఇదిగో దక్షిణ కొరియాలోని ఓ వ్యక్తికి అదృష్టం అలాగే తలుపు తట్టింది. అక్కడితో ఆగకుండా వచ్చి ఏకంగా నట్టింట్లో తిష్ట వేసింది. ఆన్‌లైన్‌లో ఐఫోన్ బుక్ చేస్తే ఇటుక రాయి వచ్చిన ఘటనలు మనకు తెలుసు. కానీ ఆన్‌లైన్‌లో కొన్న ఒక ఫ్రిడ్జి అతని ఇంట్లో లక్షలు కురిపించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపంలో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్‌‌లో ఫ్రిడ్జి ఆర్డర్ చేశాడు. కొన్ని రోజులకు ఆ ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చింది. ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ వచ్చింది కదా అని దాన్ని అతడు శుభ్రం చేయడానికి రెడీ అయ్యాడు. అదిగో అప్పుడే ఫ్రిడ్జ్ దిగువ భాగంలో అతడికి ఓ అట్టముక్క కనిపించింది. ఆ అట్టముక్క ఊడి కింద పడకుండా టేప్ వేసి ఉంది. దాంతో అతడిలో ఉత్సుకత పెరిగింది. టేపు తీసి ఆ అట్టముక్క కింద ఏముందా? అని చూశాడు. అక్కడ దాదాపు 1.3 లక్షల డాలర్ల డబ్బు దర్శనమిచ్చింది. అది మన లెక్కల్లో అయితే దాదాపు రూ.96 లక్షలకు సమానం.

దీంతో అతడు రాత్రికి రాత్రి లక్షాధికారి అయిపోయాడు. కానీ అతను విలువలున్న వ్యక్తి. తనకు దొరికిన డబ్బు తనది కాదంటూ పోలీసులకు అప్పగించేశాడు. అయితే దక్షిణ కొరియాలో చట్టాల ప్రకారం, ఆ డబ్బు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోతే 22 శాతం పన్ను ప్రభుత్వానికి చెల్లించి మిగతా డబ్బును అతడు తీసేసుకోవచ్చు. అలాకాకుండా ఎవరైనా ఆ డబ్బు తమదేనంటూ వస్తే అతడికి కొంత మొత్తం పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్నా అతను లక్షాధికారి అయినట్లే.

More Telugu News