ఏం తప్పు చేశానని నన్ను అరెస్ట్ చేసి ఇన్ని స్టేషన్లు తిప్పారు?: నారా లోకేశ్

16-08-2021 Mon 21:10
  • పెదకాకాని పీఎస్ నుంచి లోకేశ్ విడుదల
  • మంగళగిరిలో మీడియా సమావేశం
  • రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
  • ప్రభుత్వానికి 20 రోజుల డెడ్ లైన్
Nara Lokesh questions AP Govt on his arrest
పెదకాకాని పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం నారా లోకేశ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఏం తప్పు చేశానని అరెస్ట్ చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఉదయం 11 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 8.30 గంటల వరకు అనేక స్టేషన్లు తిప్పారని మండిపడ్డారు. విద్యార్థిని రమ్య కుటుంబానికి అండగా నిలబడడం మేం చేసిన తప్పా? అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన పోలీసులు వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని డీజీపీని అడుగుతున్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఏం తప్పు చేయలేదు కాబట్టే 151 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి విడుదల చేశారని లోకేశ్ వెల్లడించారు.

రమ్య హత్య జరిగితే... గన్ కన్నా ముందు వస్తాడన్న జగన్ ఎక్కడికెళ్లారని లోకేశ్ ప్రశ్నించారు. ఘటన జరిగిన 12 గంటల తర్వాత జగన్ రెడ్డి స్పందించడం బాధాకరమని పేర్కొన్నారు. "దిశ చట్టం తెచ్చామని మీరు చెబుతున్నారు. 20 రోజుల్లో గనుక రమ్య కుటుంబానికి న్యాయం చేయకపోతే 21వ రోజున టీడీపీ ఉద్యమిస్తుంది" అని హెచ్చరించారు.