నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయిన అష్రాఫ్ ఘనీ!

16-08-2021 Mon 20:49
  • ఎంత కుక్కినా పట్టక రోడ్డుపై పడిపోయిన డబ్బు!
  • రష్యన్ ఎంబసీ సంచలన ఆరోపణ
  • సాక్షులు చూశారంటున్న రష్యన్ ప్రతినిధి
Ashraf Ghani fled with cars and chopper full of cash says Russian embassy
తాలిబన్లు కాబూల్‌ను చుట్టుముట్టడంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి పారిపోయిన ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ గురించి రష్యన్ ఎంబసీ సంచలన విషయం బయటపెట్టింది. దేశం విడిచి వెళ్లే సమయంలో ఘనీ నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బు కట్టలు నింపుకున్నారని రష్యన్ అధికారులు అంటున్నారు.

తాము కాబూల్‌లో దౌత్యసంబంధాలను కొనసాగిస్తామన్న రష్యా.. తాలిబన్లను ఆఫ్ఘనిస్థాన్ పాలకులుగా గుర్తించే విషయంలో తొందరేమీ లేదని చెప్పింది. పాత ప్రభుత్వం కూలిపోయిన విధానాన్ని ఘనీ పరారవడం చాలా వివరంగా చెప్పిందని కాబూల్‌లోని రష్యన్ ఎంబసీ ప్రతినిధి నికితా ఇస్చెంకో తెలిపారు.

‘‘నాలుగు కార్లలో నిండుగా డబ్బులు నింపారు. ఇంకా మిగిలిన డబ్బును ఒక హెలికాప్టర్లో కుక్కారు. అయినా మొత్తం డబ్బును తీసుకెళ్లలేకపోయారు. మిగిలిపోయిన డబ్బు అక్కడే రోడ్డుపై పడిపోయింది’’ అని ఇస్చెంకో అన్నారు. కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని కళ్లారా చూశారని ఆయన వివరించారు. అయితే ఈ మాటల్లో ఎంత వరకూ నిజముందనే విషయంలో సరైన స్పష్టత లేదు. ఘనీ పరారైన కాసేపటికే కాబూల్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు, అనంతరం అధ్యక్ష భవనాన్ని కూడా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్థాన్ మొత్తం తాలిబన్ల ఏలుబడిలోకి వచ్చినట్లయింది.