rashidkhan: కుటుంబం గురించి ఆఫ్ఘన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఆందోళన!

Afghan cricketer Rashid Khan worried about family
  • ప్రస్తుతం యూకేలో ‘ది హండ్రెడ్’ తొలి సీజన్ ఆడుతున్న స్పిన్నర్
  • ఆఫ్ఘనిస్థాన్ లోనే రషీద్ కుటుంబం
  • విమానాల రద్దుతో క్రికెటర్ టెన్షన్
ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ ప్రస్తుతం తీవ్రమైన టెన్షన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతను యూకేలో ఉన్నాడు. ‘ది హండ్రెడ్’ క్రికెట్ ఫార్మాట్ తొలి సీజన్‌లో ట్రెంట్ రాకెట్స్ జట్టుకు రషీద్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సమయంలోనే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను మెరుపువేగంతో హస్తగతం చేసుకున్నారు. ఇప్పుడు తన కుటుంబాన్ని దేశం దాటించి తెచ్చుకోవాలన్నా రషీద్ వల్ల కావడం లేదు. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభం వల్ల కాబూల్‌లోని హమీద్ కర్జాయీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వద్ద అంతర్జాతీయ విమానాల సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో తన కుటుంబం గురించి ఆలోచించి రషీద్ చాలా ఆందోళన చెందుతున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చెప్పాడు.

‘‘ఇంటి దగ్గర పరిస్థితేం బాగలేదు. దీని గురించి బౌండరీ వద్ద మేమిద్దరం మాట్లాడుకున్నాం. అతను చాలా ఆందోళనలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి తన కుటుంబాన్ని తెచ్చుకోవడం అతని వల్ల కాలేదు’’ అని పీటర్సన్ వెల్లడించాడు. ఇంతటి ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా మంచి ప్రదర్శన ఇవ్వడం మామూలు విషయం కాదన్న పీటర్సన్.. ఈ హండ్రెడ్ సీజన్‌లో మనసుకు హత్తుకునే కథల్లో ఇదొకటని అభిప్రాయపడ్డారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోవడంతో కాబూల్‌ను, అధ్యక్ష భవనాన్ని ఆదివారం నాడు తాలిబన్లు హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.
rashidkhan
Afghanistan

More Telugu News