Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ బానిస శృంఖలాలు తెంచుకుంది: పాక్ ప్రధాని ప్రశంసలు

  • బానిసత్వం నుంచి బయటపడ్డారన్న పీఎం
  • ఆఫ్ఘన్ పరిస్థితులపై పాక్ భద్రతా కమిటీ సమావేశం
  • ఆఫ్ఘన్ పొరుగుదేశాలతో బంధాల కోసం పాక్ యత్నం
Pak PM Imran Khan hails Afghanistan

తాలిబన్ వశమైన ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించారు. ఆ దేశం తన బానిస శృంఖలాలు తెంచుకుందంటూ కితాబునిచ్చారు. అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్థాన్ వీడిన పదిరోజుల్లోనే తాలిబన్ సేనలు దేశంలోని ముఖ్యమైన పట్టణాలన్నింటినీ తమ అధీనంలోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చివరగా కాబూల్‌ను తాలిబన్ దళాలు చుట్టుముట్టడంతో ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ పారిపోయారు.

దీంతో అధ్యక్ష భవనాన్ని కూడా తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలో పాకిస్థాన్ ప్రధాని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరవై ఏళ్ల క్రితం ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడటంలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషించింది.  

తాజాగా ఆఫ్ఘన్‌లో తాలిబన్ల విజయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ‘‘ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను అలవాటు చేసుకోవడం ప్రారంభిస్తే.. ఆ సంస్కృతి చాలా గొప్పదని నమ్మడం మొదలైపోతుంది. అలా క్రమంగా దానికి బానిసలుగా మారుతాం. ఆ తర్వాత ఆ మానసిక బానిసత్వం నుంచి బయటకు రావడం చాలా కష్టం. ఇప్పుడు ఆఫ్ఘన్లు చేసింది అదే’’ అని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.

ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై పాకిస్తాన్ భద్రతా కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఆఫ్ఘన్ విషయంలో పాకిస్థాన్ వైఖరి ఏంటనేది అంతర్జాతీయ వేదికలపై ప్రకటిస్తామని పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. అలాగే ఆఫ్ఘనిస్థాన్ పొరుగుదేశాలతో సంబంధాలు ఏర్పరచుకోవాలని ఖురేషికి ఇమ్రాన్ సూచించినట్లు సమాచారం.

More Telugu News