లార్డ్స్ టెస్టులో టీమిండియా బౌలర్ల విజృంభణ... లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్లు డకౌట్

16-08-2021 Mon 19:07
  • భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు
  • ఇంగ్లండ్ టార్గెట్ 272 రన్స్
  • రోరీ బర్న్స్ ను అవుట్ చేసిన బుమ్రా
  • సిబ్లీని తిప్పిపంపిన షమీ
Team India bowlers removes England openers
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 272 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన ఇంగ్లండ్ ను ఆదిలోనే దెబ్బకొట్టింది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ ఓపెనర్లు డకౌట్ అయ్యారు. పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్ చేరారు. తొలుత రోరీ బర్న్స్ ను బుమ్రా అవుట్ చేయగా, ఆపై డామ్ సిబ్లీని షమీ వెనక్కి పంపాడు. దాంతో ఇంగ్లండ్ శిబిరంలో తీవ్ర నిరాశ నెలకొంది.

ప్రస్తుతం ఆతిథ్య జట్టు స్కోరు 6 ఓవర్లలో 2 వికెట్లకు 12 పరుగులు. క్రీజులో కెప్టెన్ జో రూట్ (4 బ్యాటింగ్), హసీబ్ హమీద్ (6 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే ఇంకా 260 పరుగులు చేయాల్సి ఉండగా, టీమిండియా గెలుపునకు 8 వికెట్ల దూరంలో ఉంది.