రవితేజ సినిమా కోసం రానున్న ఇలియానా?

16-08-2021 Mon 18:39
  • రవితేజ హీరోగా 'ఖిలాడి'
  • మాస్ ఆడియన్స్ కోసం స్పెషల్ సాంగ్ 
  • ఇలియానాతో సంప్రదింపులు 
  • త్వరలో చిత్రీకరణ
Iliana in Raviteja movie
తెలుగు తెరకి పరిచయమైన నాజూకు భామలలో ఇలియానా ఒకరు. 'దేవదాసు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆమె, యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది. ఆ సినిమా తరువాత ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. పోకిరి .. కిక్ .. జల్సా .. జులాయి వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఆమె ఖాతాలోకి చేరిపోయాయి.

ఇలియానా బాలీవుడ్ సినిమాలపై ఆశతో .. ఆరాటంతో అటువైపు పరిగెత్తే వరకూ, ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేసింది. కానీ హిందీలో ఆశించిన స్థాయిలో దూసుకుపోలేకపోయింది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమె స్థానం కూడా చేజారిపోయింది. దాంతో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తోంది.

ఈ నేపథ్యంలో రవితేజ తన తాజా చిత్రంలో ఆమెకి ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అది హీరోయిన్ వేషం కాదు. కీలకమైన సందర్భంలో వచ్చే స్పెషల్ సాంగ్. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'ఖిలాడి' సినిమా కోసం త్వరలో ఈ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాట కోసం ఆమె పేరును రవితేజనే సూచించాడని అంటున్నారు.